మోడీ మీద ఫోర్జరీ కేసు పెడతారంట

Update: 2016-01-04 07:13 GMT
ఇప్పటికే ఢిల్లీ రాష్ట్ర సర్కారు తీరుతో కిందామీదా పడుతున్న కేంద్ర సర్కారుకు మరో రాష్ట్రం నుంచి ఇబ్బందికర పరిస్థితి ఎదురుకానుంది. ఢిల్లీ రాష్ట్ర సర్కారుకు.. కేంద్రానికి మధ్యన అంత సామరస్య వాతావరణం లేకపోవటం తెలిసిందే. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన పాలనా పరమైన పోరు పెద్ద ఎత్తున సాగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా బీహార్ రాష్ట్ర సర్కారుపై మోడీపై సమరశంఖాన్ని పూరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో..  ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రయోజనం పొందేందుకు వీలుగా రూ.1.25లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి అన్న చందంగా.. తమ ప్యాకేజీ మాటతో బీహారీలు బీజేపీకి ఓట్లు గుద్దేస్తారని భావిస్తే.. అందుకు భిన్నంగా తమ తీర్పుతో భారీ షాక్ ఇవ్వటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేంద్రం తాను ప్రకటించిన ప్యాకేజీ విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లుగా విమర్శలు ఉన్నాయి. దీనికి తగ్గట్లే బీహార్ సంకీర్ణ సర్కారులో భాగస్వామి అయిన ఆర్జేడీ మోడీ సర్కారుపై మాటల దాడి మొదలెట్టింది. బీహార్ కు ప్రకటించిన రూ.1.25లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించి నిధులు ఇవ్వలేదంటూ ఆర్జేడీ ఆరోపిస్తోంది. బీహార్ అభివృద్ధికి నిధులు ఇస్తామని నమ్మబలికి.. ఇప్పుడు నిధులు ఇవ్వకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ  పార్టీ.. ప్రధాని మోడీపై నమ్మకద్రోహం.. ఫోర్జరీ కేసులు పెట్టాలని నిర్ణయించింది. చట్టబద్ధంగా ఇలాంటి కేసులేమీ నిలవనప్పటికీ.. రాజకీయంగా మోడీ ఇమేజ్  డ్యామేజ్ చేసే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకపక్క ఢిల్లీ సర్కారు.. మరోవైపు బీహార్ సర్కారుతో ఎన్డీయే సర్కారు తిప్పలు తప్పనట్లే.  ​
Tags:    

Similar News