రహదారి ప్రమాదాలు..భీతిగొలిపే మరణాలు

Update: 2018-09-12 05:47 GMT
రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. రోడ్డుపై వెళ్లాలంటేనే జనం జంకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అన్నింటికంటే సురక్షితమైన ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీ బస్సులో ఎక్కినా మరణ మృందంగాలు ఆగడం లేదు. తాజాగా తెలంగాణ లోని జగిత్యాల జిల్లా కొండగట్టులో బస్సు లోయలో పడి 58మంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దేశంలోనే ఓ బస్సు ప్రమాదంలో ఇంతమంది చనిపోవడం ఇదే అత్యధికం అని మీడియాలో వార్తలొస్తున్నాయి.

కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం మన భారతదేశంలో 2016లో అత్యధిక మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. ఉత్తరప్రదేశ్ - తమిళనాడుల్లో ఎక్కువమంది చనిపోయారు. 2016లో మొత్తం 480652 రోడ్డు ప్రమాదాలు జరగగా..ఇందులో 150785మంది చనిపోయారు. ఈ లెక్కన రోజుకి 1317 ప్రమాదాలు జరిగి 413మంది ఒక్కరోజులో చనిపోయినట్టు లెక్కతేలింది. గంటకు 55 యాక్సిడెంట్లు జరిగితే 17మంది చొప్పున చనిపోయారని గణంకాలు వెల్లడిస్తున్నాయి.

దేశంలోని జాతీయ - రాష్ట్ర - మిగిలిన రోడ్లలో ప్రమాదాల లెక్క కూడా కలవరపెడుతోంది. జాతీయ రహదారులపై 34.5 శాతం - రాష్ట్ర రహదారులపై 27.9శాతం - మిగిలిన చిన్న రోడ్లపై 37.6శాతం ప్రమాదాలు సంభవిస్తున్నాయి.  ఈ ప్రమాదాలన్నింటికి అతివేగమే ప్రధానకారణంగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాత ఫోన్ లో మాట్లాడుతూ నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.

దేశంలోకెల్లా చెన్నై రోడ్డు అత్యంత ప్రమాదకరమైనదని ప్రభుత్వం అంచనావేస్తోంది. 2016లో చెన్నైలోని 7486 యాక్సిడెంట్లు చెన్నైలోనే జరిగాయి. దాని తరువాత స్థానంలో ఢిల్లీ ఉంది. ఢిల్లీలో 7375 ప్రమాదాలు జరిగాయి.  రాష్ట్రాల విషయానికి వస్తే అత్యధికంగా యూపీలో 12.8శాతం - తమిళనాడులో 11.4 శాతం - మహారాష్ట్ర 8.6 - కర్ణాటకలో 7.4శాతం ప్రమాదాలు సంభవించి మొదటి నుంచి వరుస స్థానాల్లో ఉన్నాయి.

ఇక మరో భీతిగొలిపే విషయం ఏంటంటే 2017లో జరిగిన ప్రమాదాల్లో మొత్తం 1.47 లక్షల మంది చనిపోగా.. ఇది మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ జనాభాతో సమానం కావడం గమనార్హం. 2016లో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో 60శాతం మంది 18-35 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. వీరంతా కుటుంబాలను పోషిస్తున్న వారు కావడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.  అతివేగం - ఓవర్ టేక్ - మద్యం సేవించి వాహనాలు నడుపడం - రాంగ్ సైడ్ లో వెళ్లడం - డ్రైవర్ల తప్పిదాలు - హెల్మెట్ లేకపోవడం - సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. సో ఇప్పటికైనా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించండి.. మీరు కాపాడుకొని.. మీ కుటుంబానికి స్వాంతన ఇవ్వండి..
Tags:    

Similar News