రోహింగ్యాలు ఊపిరి పీల్చుకున్నారు!

Update: 2017-09-16 12:17 GMT
గ‌త కొన్ని నెల‌లుగా వార్త‌ల్లో వినిపిస్తున్న ప్ర‌ధాన పేరు రోహింగ్యా ముస్లింలు! అతి చిన్న దేశం మ‌య‌న్మార్‌ లో వీరిని అక్క‌డి ప్ర‌భుత్వం - సైన్యం కూడా చిత్ర హింస‌ల‌కు గురి చేస్తోంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌పంచం అంతా ఘోషించింది. మ‌రికొన్ని దేశాలైతే.. మాన‌వ హ‌క్కుల‌పై పెద్ద ఎత్తున క్లాసిచ్చే భార‌త్‌.. త‌న మిత్ర దేశం మ‌య‌న్మార్ చేస్తున్న అకృత్యాలు క‌నిపించ‌డం లేదా అని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు సైతం గుప్పించాయి. అటు పాకిస్థాన్‌ - ఇటు శ్రీలంక‌ల్లోనూ రోహింగ్యాల‌కు అనుకూల ఉద్య‌మాలు జ‌రిగాయి. ఈ విష‌యంలో ఐక్య‌రాజ్య స‌మితి జోక్యం చేసుకుని తీరాల‌నే వ‌ర‌కు నినాదాలు వినిపించాయి.

ఇక‌, ఈ క్ర‌మంలోనే భార‌త్‌లో ప‌ర్య‌టించిన మ‌య‌న్మార్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు. విదేశాంగ ప్ర‌తినిధి ఆంగ్ సాన్ సూచీతో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌త్యేకంగా ఈ రోహింగ్యాల స‌మ‌స్య‌పై చ‌ర్చించారు. వారికి ఉగ్ర‌వాద ముద్ర‌వేసి.. వెలివేయ‌డం స‌మంజ‌సం కాద‌న్నారు. ఇదిలావుంటే, ఈ విష‌యంలో మ‌య‌న్మార్ పొరుగు దేశం బంగ్లాదేశ్ స్పందించింది. రోహింగ్యాల‌కు ఆప‌న్న హ‌స్తం అందించింది. మయన్మార్‌ నుంచి వలస వచ్చిన 4 లక్షల రోహింగ్యా శరణార్థుల కోసం 14 వేల తాత్కాలిక వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ శనివారం ప్రకటించింది.

మయన్మార్‌ కు సరిహద్దు ప్రాంతమైన కుటుపాలోంగ్‌ లో తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామని బంగ్లా డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ సెక్రెటరీ షా కమల్‌ చెప్పారు. ఈ షెల్టర్లలోనే 4 లక్షల రోహింగ్యా శరణార్థులకు ఆశ్రయం కల్పించడంతో పాటూ.. తాగునీరు - ఆహార - శానిటేషన్‌ - వైద్య సదుపాయాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో షెల్టర్‌ లో 6 నుంచి 10 కుటుంబాలు ఆవాసం ఉంటాయన్నారు. మొత్తానికి ఈ ప‌రిణామంతో గ‌త కొంత‌కాలంగా ఊపిరి స‌ల‌ప‌ని బాధ‌ను అనుభ‌విస్తున్న రోహింగ్యాలు ఊపిరి పీల్చుకున్నారు.
Tags:    

Similar News