టీమిండియా ఈ నెల చివర్లో దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం టెస్టు జట్టును, వన్డే సారథిని ప్రకటించారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టు వైస్ కెప్టెన్ గా , వన్డే కెప్టెన్ గా ప్రమోషన్ కొట్టేశాడు. 18 మంది సభ్యుల జట్టులో ఇదే పెద్ద ఆశ్చర్యకర మార్పు. సీనియర్లు రహానే,పుజారా స్థానాలకు ఎటువంటి ఢోకా లేకుండా పోయింది. వీరికి జట్టులో చోటు దక్కింది. యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్, ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా గాయాలతో దూరమయ్యారు. ఇక సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కూడా జట్టులో చోటుదక్కించుకున్నాడు. ప్రధాన పేసర్లు షమి, బుమ్రా, ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్ తిరిగి వచ్చారు. ఉమేశ్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ ఇతర పేసర్లు. న్యూజిలాండ్ తో సిరీస్ లో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్ , మయాంక్ అగర్వాల్ కు మరో అవకాశం దక్కింది. గాయంతో కివీస్ సిరీస్ కు దూరమైన కేఎల్ రాహుల్ మళ్లీ చోటు దక్కించుకున్నాడు. స్టాండ్ బైలుగా పేసర్లు నవదీప్ సైనీ, అర్జున్ నాగవస్వాలా, దీపక్ చహర్, సౌరభ్ కుమార్ లను ప్రకటించారు. కాగా, ఇటీవల కివీస్ తో మూడు టి20ల సిరీస్ కు పూర్తి స్థాయి కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ శర్మ ఇకపై వన్డేల్లోనూ జట్టు ను నడిపించనుండడం విశేషం.