రోహిత్ శర్మ నిఖార్సైన ఇన్నింగ్స్.. కెప్టెన్ గా తొలి టెస్టు సెంచరీ

Update: 2023-02-10 14:45 GMT
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు పాసయ్యాడు. సహచరులు వెనుదిరుగుతున్నా వెన్నుచూపకుండా ఆడిన అతడు టెస్టు కెప్టెన్ గా తొలి సెంచరీని సాధించాడు. రోహిత్ కిది తొమ్మిదో టెస్టు సెంచరీ. కానీ, ఎంతో ప్రత్యేకమైనది. ఏడాది కిందట కెప్టెన్ అయ్యాక, ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ లో పరాజయం చూశాక, బంగ్లాదేశ్ తో సిరీస్ కు గాయంతో దూరమైన నేపథ్యంలో, మరో టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లేందుకు గెలుపు అత్యవసరమైన సందర్భంలో రోహిత్ శర్మ చేసిన ఈ సెంచరీ అత్యద్భుతం అనే చెప్పాలి. 43లో ఇదే మొదటిది 2007లో టి20 ప్రపంచ కప్ లో ప్రారంభమైన రోహిత్ ప్రస్థానం 16 ఏళ్లుగా సాగుతూనే ఉంది. మధ్యలో ఎన్నో ఎత్తుపల్లాలు. టెస్టుల ఆడలేడని విమర్శలు.జట్టు నుంచి కూడా వేటు.

మిడిలార్డర్ నుంచి ఓపెనర్ గా మారాక కాని రోహిత్ గొప్పదనం ఏమిటో తెలిసొచ్చింది. ఏడెనిమిదేళ్లుగా అతడికి తిరుగులేదు. రెండేళ్లుగా టెస్టుల్లోనూ రాణిస్తున్నాడు. ఏడాది కిందట కెప్టెన్ కూడా అయ్యాడు. కాగా, ఆసియా కప్, టి20 ప్రపంచ కప్ లో వైఫల్యంతో రోహిత్ ను వయసు రీత్యా పొట్టి ఫార్మాట్ కు పరిగణించడం కష్టమనే అభిప్రాయాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచ కప్ తర్వాత అతడు వన్డేలకూ దూరం అవుతాడనే భావన ఉంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టుల్లో తన ముద్ర చాటుకుంటూ కెప్టెన్ గా రాణించాల్సిన పరిస్థితి. అలాంటి సందర్భంలో రోహిత్ మూడంకెల స్కోరు చేశాడు.

అతడు ఇప్పటివరకు టెస్టుల్లో 9 సెంచరీలు చేయగా.. అన్ని ఫార్మాట్లు కలిపి 43 సెంచరీలు (వన్డేల్లో 30, టీ20ల్లో 4) బాదాడు.రెండేళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో నాగపూర్ లో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ చేసిన సెంచరీ అతడికి ఎప్పటికీ గుర్తుంటుంది. ఎందుకంటే కెప్టెన్ గా తొలి అనే కాదు..

దాదాపు రెండేళ్ల తర్వాత రోహిత్ టెస్టుల్లో సెంచరీ కొట్టడం విశేషం. కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 177. రోహిత్ బౌండరీతో సెంచరీని చేరుకున్న సమయానికి భారత్ చేసిన పరుగులు 176.అంటే అతడే ఒంటిచేత్తో ఇన్నింగ్స్ ను నడిపించాడు.

కఠిన పిచ్ పై డ్యాషింగ్‌ బ్యాటర్ సూర్యకుమార్‌ (8), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (12), చతేశ్వర్ పుజారా (7)విఫలమయ్యారు. ఇక అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే తొలి నాలుగు వికెట్ల తీసిన మూడో ఆసీస్‌ బౌలర్‌గా టాడ్ మర్ఫీ అవతరించాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News