చంద్ర‌బాబు... ఫాద‌ర్ ఆఫ్ బెల్ట్ షాప్స్‌ అట‌!

Update: 2017-07-18 08:23 GMT
టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుపై విమ‌ర్శ‌లు గుప్పించే విష‌యంలో వైసీపీ కీల‌క నేత‌, చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులోని న‌గ‌రి ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆర్కే రోజా ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. చంద్ర‌బాబు స‌ర్కారు తీసుకునే ప్ర‌తి కీల‌క నిర్ణ‌యాన్ని ఇట్టే ప‌సిగ‌ట్టేసే రోజా... దానినే ఆస‌రా చేసుకుని చంద్ర‌బాబుపై సంధిస్తున్న విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టే విష‌యంలో టీడీపీ నేత‌లు విఫ‌ల‌మ‌వుతున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రోజా విమ‌ర్శ‌ల‌కు జడిసే... ఆమెపై స‌స్పెన్ష‌న్లు, నోటీసులు ఇస్తున్నార‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఇప్ప‌టికే అసెంబ్లీ సాక్షిగా చంద్ర‌బాబు స‌ర్కారుపై నిప్పులు చెరిగిన రోజా... టీడీపీ నేత‌ల ఆగ్ర‌హానికి గుర‌య్యారు. స‌భా నాయ‌కుడి స్థానంలో ఉన్న చంద్ర‌బాబుపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌న్న ఒకే ఒక్క కార‌ణం చూపిన టీడీపీ స‌ర్కారు.... రోజాను ఏకంగా ఏడాది పాటు స‌భ నుంచి స‌స్పెండ్ చేసింది.

అయితే ఆ స‌స్పెన్ష‌న్ కాల ప‌రిమితి ఇటీవ‌లే ముగియ‌గా... మ‌ళ్లీ రోజా అసెంబ్లీలో అడుగుపెట్టారు. నిన్న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌ కు సైతం హాజ‌రైన ఆమె... స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు స‌భాప‌తి స్థానానికి మ‌చ్చ తెచ్చేలా ఉందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రోజా... మ‌రో ద‌ఫా నోటీసులు అందుకునేందుకు సిద్ధం కాక త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. నిన్న అసెంబ్లీ ప్రాంగ‌ణంలో రోజా చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆధారం చేసుకుని ఆమెకు నోటీసులు జారీ చేయాల‌ని స్పీకర్ అసెంబ్లీ సెక్ర‌టేరియ‌ట్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అయితే అటు ప్ర‌భుత్వం, ఇటు స్పీక‌ర్ కార్యాల‌యం నుంచి త‌న‌కు ఎంత‌గా ఇబ్బంది క‌లుగుతున్నా కూడా రోజా ఏమాత్రం వెన‌క్కు త‌గ్గిన దాఖలా క‌నిపించ‌లేదు. ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేగా ప్ర‌భుత్వం తీసుకునే ప్ర‌తి నిర్ణ‌యాన్ని విశ్లేషించ‌డంతో పాటు ప్ర‌జ‌ల‌కు ఆ నిర్ణ‌యం వ‌ల్ల ఏదైనా న‌ష్టం జ‌రుగుతుంటే చూస్తూ ఊరుకోలేమ‌న్న కోణంలో ఆరోప‌ణ‌లు సంధిస్తున్న రోజా... కాసేప‌టి క్రితం చంద్ర‌బాబు స‌ర్కారు మ‌ద్యం పాల‌సీపై మ‌రోమారు విరుచుకుప‌డ్డారు.

నవ్యాంధ్ర‌కు సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు చేసిన తొలి నాలుగు సంత‌కాల‌కు సంబంధించిన వాటిలో ఇంకా మూడు అస‌లు అమ‌ల్లోకి వ‌చ్చిన దాఖ‌లాలే లేవ‌ని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో మ‌ద్య నిషేధాన్ని అమ‌లు చేస్తామ‌ని చెబుతూ చంద్ర‌బాబు సంత‌కం చేశార‌ని, ఇప్ప‌టిదాకా ఆ దిశ‌గా సింగిల్ చ‌ర్య కూడా తీసుకున్న దాఖ‌లా క‌నిపించ‌లేద‌ని ఆమె ఆరోపించారు. బెల్టు షాపులంటే క‌నీసం అర్ధం కూడా తెలియ‌న‌ట్లుగా టీడీపీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించిన రోజా... అక్ర‌మంగా న‌డిచే మ‌ద్యం షాపుల‌నే బెల్టు షాపులుగా పిలుస్తార‌ని కూడా చెప్పారు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు స్వ‌ర్గీయ ఎన్టీఆరే త‌మ‌కు ఆద‌ర్శ‌న‌మ‌ని చెప్పుకునే చంద్ర‌బాబు... ఎన్టీఆర్ ప‌క్కాగా అమ‌లు చేసిన మ‌ద్య నిషేధానికి తూట్లు పొడుస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

అస‌లు బెల్టు షాపుల‌కు చంద్ర‌బాబే ఆద్యుడ‌ని ఆరోపించిన రోజా... చంద్ర‌బాబును ఫాద‌ర్ ఆఫ్ బెల్ట్ షాప్స్‌గా అభివ‌ర్ణించారు. స‌ర్కారు కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన మ‌ద్యం పాల‌సీలో లెక్క‌లేన‌న్ని లొసుగులు ఉన్నాయ‌ని ఆమె దుయ్య‌బ‌ట్టారు. ఒక్క మ‌ద్య నిషేధంపైనే కాకుండా డ్వాక్రా రుణాల‌ను మాఫీ చేస్తామంటూ మ‌హిళ‌ల‌కు ఇచ్చిన హామీని కూడా చంద్ర‌బాబు తుంగ‌లో తొక్కేశార‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల నాడు, సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఇచ్చిన హామీల్లో మెజారిటీ హామీలు... హామీలుగానే మిగిలిపోయాయ‌ని కూడా రోజా వ్యాఖ్యానించారు. మ‌రి రోజా వ్యాఖ్య‌ల‌పై టీడీపీ స‌ర్కారు గానీ, టీడీపీ నేత‌లు గానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News