రోజా 2017 ఎండింగ్ పంచ్ అదిరిందిగా?

Update: 2017-12-30 10:49 GMT
ఏపీ ఫైర్ బ్రాండ్ రోజా మాట‌లే మాట‌లు. ప్ర‌త్య‌ర్థుల‌కు త‌న మాట‌ల‌తో చుక్క‌లు చూపే ఆమె.. ప‌ది మంది రాజ‌కీయ నేత‌ల‌కు స‌రిస‌మాన‌మ‌ని చెప్పాలి. రోజా నోటి నుంచి వ‌చ్చే ఒక్కో మాట ఒక్కో బుల్లెట్ మాదిరి దూసుకెళుతుంద‌ని చెప్పాలి. విన్నంత‌నే మంట పుట్టేలా.. ఆవేశంతో అగ్గిమీద గుగ్గిలం అయ్యేలా ఉండే ఆమె మాట‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

తాజాగా.. 2017 ఏడాది చివ‌ర్లో .. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఉద్దేశించి రోజా చేసిన ఎండింగ్ పంచ్ అదిరిపోయింద‌ని చెప్పాలి. 2017 సంవ‌త్స‌రం రివ్యూను ఒక్క మాట‌లో ఆమె తేల్చేశారు. 2017 సంవ‌త్స‌రాన్ని నారావారి న‌ర‌కాసుర నామ సంవ‌త్స‌రంగా ఆమె ఎద్దేవా చేసిన తీరు తెలుగు త‌మ్ముళ్ల‌కు మంట పుట్టిస్తోంది.

బాబు పాల‌న‌తో ఏడాది మొత్తం ఆరాచ‌కాలు. అత్యాచారాలు.. అత్మ‌హ‌త్య‌లు.. అబ‌ద్ధాల‌తో సాగుతోంద‌ని ఆమె మండిప‌డ్డారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా విడుద‌ల చేసిన మేనిఫెస్టోను చంద్ర‌బాబు ధైర్యంగా చూసుకోగ‌ల‌రా? అని ప్ర‌శ్నించారు. 2017లో చంద్ర‌బాబు పాల‌న‌తో మ‌హిళ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గురయ్యారంటూ తీవ్రంగా ధ్వ‌జ‌మెత్తారు.  

త‌న ప్రెస్ మీట్లో చంద్ర‌బాబుపై త్రీవ‌స్థాయిలో విరుచుకుప‌డిన రోజా తూటాల్లాంటి మాట‌ల్ని ఆమె మాట‌ల్లోనే చెబితే...

+  'నాలుగు బడ్జెట్‌ లు మారుతున్నాయిగానీ ఆడవాళ్ల తలరాతలు మారలేదు. రెండో సంతకం మద్యం షాపుల నిషేధానికి సంబంధించిన దస్త్రంపైనే పెడతానన్నారు. ఇప్పుడేమో మద్యపు ఏరుల్ని పారిస్తూ ఖజానా నింపుకోవడానికి రాత్రి ఒంటి గంట వరకు వైన్‌ షాపులు నడుపుకునేందుకు లైసెన్స్‌లు ఇచ్చారు.

+ ఆడవాళ్ల జీవితాలు చెడిపోయినా పర్వాలేదన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఆంగ్ల సంవత్సరం మనకొద్దని, ప్రత్యేక జీవో ఇచ్చిన చంద్రబాబు గుడులు అలంకరణ చేయొద్దని వైన్స్‌లు మాత్రం కళకళలాడేట్లు చేశారు.

+ టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ కూతురుకి కూడా అన్యాయం జరిగిందంటే.. టీడీపీ పాలనలో ఇంతకంటే దౌర్బాగ్యం మరొకటి ఉండదు.

+  టీడీపీలో రౌడీలు, గుండాలే రాజ్యమేలుతున్నారు. ఆడపిల్ల అంటే చంద్రబాబుకు గౌరవం లేదు, పట్టించుకోరు. జెర్రిపోతుల పాలెం ఘటనపై చంద్రబాబు కనీసం ఒక్క ప్రకటన చేయలేదు.

+ డ్వాక్రా మహిళల రుణాలు ఎత్తివేసేందుకు  రూ.14,204కోట్లు ఇస్తే సరిపోతుంది. ఈ డబ్బు చంద్రబాబు, టీడీపీ నేతలు దోచుకున్న దానితో పోలిస్తే 1శాతం. కానీ, అధికారంలోకి వచ్చిన బాబు మాత్రం మహిళలకు పంగనామాలు పెట్టారు. వారికి మాత్రం సాయం చేయ‌లేదు.

+  చంద్రబాబు ఎప్పుడు తమ గ్రామాల్లోకి అడుగుపెడతారా? ఎప్పుడు నిలదీద్దామా? అని మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పుట్టిన ప్రతి బిడ్డ పేరిట రూ.30 వేలు వేస్తానని అన్నారు.. ఇప్పటి వరకు ఏపీలో ఆడపిల్లలే పుట్టలేదా?  వారి ఖాతాల్లో ఎంత వేశారు?

+  పౌష్టికాహారం కోసం గర్భిణీలకు రూ.10 వేలు ఇస్తానని వారిని మోసం చేశారు. పేద మహిళలకు స్మార్ట్‌ ఫోన్‌లు ఇస్తానని చెప్పారు. అన్యాయం జరిగిన ఐదు నిమిషాల్లో వారి ముందు ఉంటామ‌ని చెప్పి మోసం చేశారు.

+  న్యాయం చేయకపోగా అన్యాయానికి గురైన మహిళలు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌ కు వెళితే వారిని భయపెట్టి వెనక్కు పంపుతున్నారు. ఇప్పటి వరకు రిషితేశ్వరి కేసు ఎటూ తేలలేదు. అనంతపురం జిల్లాలో సుదమ్మ అనే మహిళను కొంచెం పక్కకు జరిపి కట్టమన్నందుకు పయ్యావుల అనుచరులు ఎగిరెగిరి ఆమెను తన్నారు.

+ ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలపై ఏపీలో జరిగిన దాడులు ఎన్నో ఉన్నాయి. పోలీసులు నేరస్తుల కోసం పనిచేస్తున్నారేమో అనిపిస్తోంది.
Tags:    

Similar News