ఎన్నిక‌ల కోసం బాబు ఎన్టీఆర్ జ‌పంః రోజా

Update: 2017-07-08 11:01 GMT
ఏపీ సీఎం చంద్రబాబుపై  వైసీపీ ఎమ్మెల్యే రోజా విమ‌ర్శ‌లు గుప్పించారు.  చంద్ర‌బాబుకు జనంలో చ‌రిష్మా లేనందువల్లే ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారని విమర్శించారు. చంద్ర‌బాబుకు నిజంగా సత్తా ఉంటే వైఎస్ జగన్‌ లాగా సొంత పార్టీ పెట్టి, ప్రతిపక్షంలో కూర్చొని అధికార పార్టీతో ఢీకొనాల‌ని సవాల్ విసిరారు. కేవలం ఎన్నిక‌ల్లో గెలుపు కోస‌మే ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నార‌ని విమ‌ర్శించారు.

గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహిస్తున్న వైసీపీ ప్లీనరీ తొలిరోజు సమావేశంలో రోజా ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబుపై కీల‌క‌మైన‌ వ్యాఖ్యలు చేశారు. గతంలో జ‌రిగిన మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా  హాజ‌రుకాలేదన్నారు.  వారంద‌రూ దూరంగానే ఉండ‌డాన్ని బట్టి ఆ పార్టీ ఎవరి చేతుల్లో ఉందనేది అర్థమవుతోందన్నారు. గత మహానాడుల్లో ఎన్టీఆర్ చిత్రపటాలను కూడా తొల‌గించి వేశార‌ని ఈ సందర్భంగా రోజా గుర్తు చేశారు.

రోజా మాట్లాడుతూ....ఎన్టీఆర్ స్థాపించిన సమయంలో ఉన్న పార్టీ సిద్దాంతాలు ప్రస్తుత టీడీపీలో లేవని విమర్శించారు. కేవలం ప్రచారం కోసం, ఎన్నికల్లో విజయం సాధించడం కోసం మాత్రమే ఎన్టీఆర్ పేరును చంద్రబాబు వాడుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్తే  ఎవరూ ఓటేయరన్న విషయం ఆయనకు కూడా తెలుసని రోజా ఎద్దేవా చేశారు. ఇక జగన్ పై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ.. ప్రతీ ఏటా ఆయన తన ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పిస్తున్నారని గుర్తుచేశారు. దీనిపై మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు.
Tags:    

Similar News