రాజు గారి గుండెలదిరే భారీ స్కెచ్...?

Update: 2022-01-17 05:12 GMT
పాలిటిక్స్ అంటేనే ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. స్కెచ్ గీయడమే కాదు, వాటిని పవర్ ఫుల్ గా అమలు చేయడమూ అతి పెద్ద విద్యగా ఉంటుంది. ఈ పొలిటికల్ ఆర్ట్ లో ప్రవీణులు అయినా వారే పవర్ లోకి వస్తారు, ఎవరికైనా పవర్ ని ఇస్తారు. ఏపీలో చూసుకుంటే పవర్ ఫుల్ గేం ఒకటి తొందరలో స్టార్ట్ కాబోతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం లోక్ సభకు ఇదే ఏడాది ఉప ఎన్నికలు రాబోతున్నాయి.

అది తధ్యమనే అంతా అంటున్నారు. సిట్టింగ్ ఎంపీ, వైసీపీ రెబెల్ లీడర్ రఘురామక్రిష్ణం రాజు  జోరు చూస్తూంటే వచ్చే ఆరు నెలల వ్యవధిలో ఏ క్షణమైనా ఉప ఎన్నికలు తేవాలన్న ఆరాటం అయితే గట్టిగా కనిపిస్తోంది.  అందుకే ఆయన వరస సవాళ్ళు విసురుతున్నారు.

నర్సాపురంలో నెగ్గేది నేనే అందుకే ఎక్కడా తగ్గేదే లేదు అంటూ హుషార్ చేస్తున్నారు. రాజు గారి లెక్క పక్కా. ఆయన కనుక పోటీ చేస్తే విపక్షం మొత్తం ఏకమై మద్దతు ఇవ్వడం ఖాయం. జగన్ దూకుడుకు కళ్ళెం వేయాలన్న  ఏకైక అజెండాతో ఏపీలోని ప్రతిపక్షం పనిచేస్తుంది అన్నది తెలిసిందే.

ఈ నేపధ్యంలో నర్సాపురం ఉప ఎన్నిక లాంటి గోల్డెన్ చాన్స్ ని విపక్షం అసలు వదులుకోదు. ఇక రాజు గారు ఎటూ  ఒక్క వైసీపీకి తప్ప అన్ని పార్టీలకు బహు ఇష్టుడు. ఆయన్ని ముందు పెట్టి ఏపీ పాలిటిక్స్ ని గింగిరాలు తిప్పే మాస్టర్ స్ట్రాటజీ తో  ఎపుడు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉంటారు.

సో నర్సాపురం లోక్ సభకు ఉప ఎన్నిక వస్తే అధికార పక్షమైన వైసీపీయే సర్దుకోవాల్సి ఉంటుంది. ఆ పార్టీయే వ్యూహాల కోసం వెతకాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముందు క్యాండిడేట్ ఎవరూ అన్నది కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది.

అయితే దీని మీద వైసీపీ కూడా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోంది అంటున్నారు. రఘురామ రాజీనామా చేస్తే ఆరు నెలల్లో ఉప ఎన్నిక ఖాయం. కాబట్టి నెమ్మదిగా అయినా తమ వ్యూహాలకు పదును పెడుతోంది వైసీపీ. రఘురామ మీద పోటీ చేసేందుకు ఒక అభ్యర్ధిని కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే ఆయన వైసీపీ నేత కారు. ఆ పార్టీకి సంబంధం లేని తటస్థ వ్యక్తి. పైగా ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన పేరు ఎంవీజీకే భాను. ఆయన 2018లో పదవీ విరమణ చేశారు. ఇక 2019 అసోం ఎన్నికల్లో తేజ్ పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అసోంలో అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక ఏపీ వరకూ చూస్తే వైఎస్సార్ కి ఆయన సన్నిహితుడుగా ఉన్నారు. ఆయన కార్య్దర్శిగా పనిచేశారు. అలాగే నీటి పారుదల శాఖ వ్యవహారాలలో వైఎస్సార్ కి కుడి భుజంగా పనిచేసారు అని చెబుతారు. ఆ తరువాత రోశయ్య హయంలో కూడా ఆయనకు కార్యదర్శిగా ఉండేవారు.

గోదావరి జిల్లాలో బలమైన సామాజికవర్గానికి చెందిన భాను నర్సాపురంలో పక్కా లోకల్. సో ఆయన్ని ముందు పెట్టి రాజు గారి ఆట కట్టించాలని వైసీపీ భారీ స్కెచ్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది. భానుకు కూడా పాలిటిక్స్ ఇష్టం. దాంతో పాటు ఆయన సామాజికవర్గం కూడా గట్టిగా ఉండడంతో ప్లస్ అయ్యే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

ఇక నర్సాపురం ఉప ఎన్నికలో వైసీపీని గెలిపించే బాధ్యత మొత్తం రెండు ప్రధాన సామాజికవర్గానికి చెందిన మంత్రులకే వైసీపీ అప్పగించనుందని టాక్. ఇక రాజు రాజీనామా ఆమోదం పొందిన మరుక్షణం నుంచి బరిలోకి దిగిపోయేలా గ్రౌండ్ లెవెల్ వర్క్ కూడా సిద్ధం చేశారని అంటున్నారు. మొత్తానికి చూస్తే నర్సాపురం లోక్ సభ ఉప ఎన్నిక అలాంటిది ఇలాంటిది కానే కాదు. చూడాలి మరి ఎలా ఉంటుందో ఆ రాజకీయం.
Tags:    

Similar News