ప్రగతిభవన్ లో ట్రిపుల్ ఆర్ మూవీ.. బండి పంచ్ లు మామూలుగా లేవుగా?

Update: 2021-10-24 12:30 GMT
దర్శక దిగ్గజం రాజమౌళి ఏ ముహుర్తంలో ట్రిఫుల్ ఆర్ మూవీని మొదలు పెట్టారో కానీ.. బాగా ఫేమస్ అయిన ఈ పేరును ఎవరికి వారు తమ యథాశక్తిగా వాడేసుకుంటున్నారు. తాజాగా జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ.. బీజేపీకి ‘ట్రిఫుల్ ఆర్’ మాట ప్రముఖంగా మారింది. రానున్న రోజుల్లో తెలంగాణ అసెంబ్లీలో ట్రిపుల్ ఆర్ కాంబినేషన్ అదరగొడుతుందన్నమాటను కమలనాథులు బలంగా చెబుతున్నారు. ఇంతకూ ట్రిఫుల్ ఆర్ అంటే మరేమీ కాదు.. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలుగా రాజాసింగ్.. రఘునందనరావులు ఉన్నారు. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేస్తున్న రాజేందర్ విజయం సాధిస్తారని.. దీంతో.. తెలంగాణ అసెంబ్లీలో త్రిపుల్ ఆర్ సీన్ కనిపిస్తుందని చెబుతున్నారు.

తాజాగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. నవంబరు 2న ప్రగతి భవన్ లో ట్రిపుల్ ఆర్ సినిమా చూపెడతామన్న ధీమాను వ్యక్తం చేశారు. జమ్మికుంటలో చేసిన ప్రచారానికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి జమునతో కలిసి బండి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తన ప్రసంగం మధ్యలో బీజేపీకి మద్దతుగా సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేయమనగానే.. సభకు వచ్చిన వారంతా లైట్లు వేసి తమ మద్దతును తెలపటం విశేషం.

బండి చేసిన ఘాటు వ్యాఖ్యలకు సంబంధించిన ఆయన మాటల్లోనే చూస్తే..

-  వచ్చేనెల 2న కేసీఆర్ కు ప్రగతి భవన్ లో ‘ట్రిపుల్ ఆర్ ’ సినిమా చూపిస్తాం. 30న జరిగే ఎన్నికల్లో పువ్వు గుర్తుకే అందరూ ఓటేయ్యాలి. మీరు వేసే ఓట్లతో కేసీఆర్ షాక్ కావాలి. బండి సంజయ్ మీటింగ్ కు 20 మంది మాత్రమే వచ్చారని కేసీఆర్ చెబుతుండు...చెప్పినోడికి చెవుల్లేవు. ఈటల రాజేందర్ కు మద్దతుగా, నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలుపుతూ అందరూ మొబైల్ లో టార్చ్ వేయాలి. (ప్రజలంతా మొబైల్ లో టార్చ్ వేసి మద్దతు పలికారు)

-  టీఆర్ఎసోళ్లు ఎన్నికలు వాయిదా వేస్తే బాగుండని అనుకుంటన్నరు. ఎందుకంటే డబ్బులు, మందు కేసీఆర్ అప్పటిదాకా పంపుతారని ఆశ పడుతున్నరు. ఒకాయన నన్ను కోతి అంటున్నరు. టీఆర్ఎస్ ను చూసి కోతులన్నీ భయపడి పోతున్నయ్. గుంట నక్కలు, దండు పాళ్యం ముఠా లెక్క జనంమీద పడి దోచుకుంటున్నరు. బండి సంజయ్ కొదమ సింహం లాగా అడ్డుకుని కొట్లాడి తీరతడు.

-  దేశంలో పేదోళ్లు బాగుండాలని కోరుకోని ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే. అలాంటి వ్యక్తిని గొప్ప వ్యక్తి, తమ రాష్ట్రంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? (లేదు..లేదు..అంటూ నినాదాలు) కేసీఆర్...ఈ ఎన్నికల్లో ఓటుకు రూ.20 వేలు పంపుతున్నరట. అందులో టీఆర్ఎసోళ్లు రూ.15 వేలు కమీషన్ తీసుకుని ఓటర్లకు రూ. 5వేలే ఇస్తున్నరట. అవికూడా దొంగ నోట్లు ఇచ్చే ప్రమాదం ఉంది. అన్నీ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొండి

-  కిషన్ రెడ్డిపై దాడి చేస్తే భయపడే ప్రసక్తే లేదు. నమ్మిన సిద్ధాంతాల కోసం  ఈ జమ్మికుంట గడ్డ మీద నా సమ్మిరెడ్డి, నా రవీందర్ రావు నక్సలైట్ల తూటాలకు బలి అయి తూటాలకు బలయ్యారు. మేం నక్సలైట్లను ఎదిరించినం. అప్పుడు నీ టీఆర్ఎస్ పార్టీ, నువ్వు పుట్టనేలేదు. మీ అయ్య పాస్ పోర్ట్ బ్రోకర్....మీరా బీజేపీకి సుద్దులు చెప్పేది?

-  మూర్కుడు చేతిలో తెలంగాణ బందీ అయ్యింది. మంది యువత తెలంగాణ వస్తే ప్రజల బతుకులు బాగుపడతాయని శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య, సుమన్, సుగుణన్నసహా 1400 ప్రాణ త్యాగం చేశారు.  కేసీఆర్ ఆయన కుటుంబం, అగ్గిపెట్టె మంత్రి హరీష్ రావు ఏం త్యాగం చేశారని అధికారం ఇవ్వాలి? తెలంగాణ తల్లి గడీల్లో బందీ అయ్యింది.

-  సీఎం మాట్లాడితే వరి వేస్తే ఉరి అన రైతులను భయపెడుతున్నరు. రైతులు తమ పొలంలో ఏ పంట వేయాలనే వాళ్ల ఇష్టం. కేసీఆర్ ఎవరు....చెప్పడానికి? అసలు బియ్యానికి-రైతుకు సంబంధమేంది? రైతులు వడ్లు మాత్రమే అమ్ముతారు. మిల్లర్లతో కుమక్కైన కేసీఆర్ కమీషన్లు రావడం లేదనో అక్కసుతో వరి వేస్తే ఉరే అని భయపెడుతున్నరు. కేసీఆర్ మెడలు వంచి వరి కొనిచ్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. అసలు కేసీఆర్ కు ఏం సంబంధం? ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రతి గింజా కొనేది కేంద్రమే. ఆఖరికి ధాన్యం బస్తాలు, సుతిలి తాడుసహా అన్నింటికీ కేంద్రమే నిధులిస్తోంది.

-  ఎరువుల కొనుగోలుపై ఎకరాకు రూ.1800లకుపైగా యూరియాపైన, డీఏపీపై రూ.1250ల చొప్పున రూ.2400లు సబ్సిడీ ఇస్తోంది నరేంద్రమోదీ ప్రభుత్వమే. మొత్తంగా ఎకరానికి రూ.5 నుండి రూ.6 వేల వరకు సబ్సిడీని కేంద్రం అందిస్తోంది. కేసీఆర్ మాత్రం రైతు బంధు మినహా అన్ని సబ్సిడీలను బంద్ చేసి రైతుల పొట్టకొడుతున్నరు.

-  ఈటల రాజేందర్ చేసిన తప్పేముంది? కోవిడ్ సమయంలోనూ రాత్రింబవళ్లు ఆసుపత్రులు తిరిగిండు. కుటుంబ సభ్యులను మెప్పించి తనకు ప్రజలే ముఖ్యమని చెబుతూ కోవిడ్ వార్డుల్లోకి వెళ్లి ప్రజలకు భరోసా ఇచ్చిన నాయకుడు ఈటల రాజేందర్. ఇచ్చిన హామీలేమైనయ్? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించిన పాపానికి తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ నుండి బయటకు పంపిన మూర్ఖుడు కేసీఆర్.  

-  ఆనాడు తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి యువత ఆత్మహత్య చేసుకుంటే...ఈరోజు ఉద్యోగాలు రాక బతకలేక యువత ఆత్మహత్య చేసుకుంటున్నరు. ఉస్మానియా వర్శిటీలో మురళి, నర్సయ్య, కేయూ వర్శిటీలో సునీల్ నాయక్ తమ చావుకు కేసీఆరే కారణమంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నారు.

-  దళిత బంధును ఆపించింది కేసీఆరే. రాబంధు నోటి నుండి ఏ సంక్షేమ పథకం వచ్చినా జనం పట్టించుకోరు. అన్నీ బంద్ కావడం ఖాయం. దళిత బంధు ఎవరు ఆపారో ప్రమాణం చేద్దాం...యాదాద్రికి రా...తేల్చుకుందామని సవాల్ విసిరితే తోకముడిచి పారిపోయిన వ్యక్తి కేసీఆర్. దళితబంధు మొదలై 70 రోజులవుతున్నా...ఇంతవరకు ఒక్కరికి కూడా నిధులివ్వకుండా మోసం చేసిన మూర్ఖుడు కేసీఆర్.

-  ఈ ఎన్నికలు హుజూరాబాద్ కు మాత్రమే పరిమితం కాదు. రాష్ర ప్రజలంతా చూస్తున్నరు. పేదలంతా మొక్కుతున్నరు. టీఆర్ఎస్ కు డిపాజిట్ రాకుండా ఓడించాలని కోరుతున్నరు. రాష్ట్రంలో పేదల ప్రభుత్వం రావాలంటే.....కాషాయ జెండా అధికారంలోకి రావాలని జనం కోరుతున్నరు. కేసీఆర్...మళ్లీ రేపు వస్తారు...కులం, వర్గం, మతం, వర్ణం, సంఘం పేరుతో ఓట్లు చీల్చే కుట్ర చేస్తరు. వాటిని తిప్పికొట్టి అందరూ ఈటలను గెలిపించాలి.

-  పెట్రోలు లీటర్ కు రూ.41లు దొబ్బిపోతోంది కేసీఆర్ ప్రభుత్వమే. అయినా నరేంద్రమోదీ పెట్రోల్ ధర పెంచారంటూ గగ్గోలు పెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రజలు నమ్మవద్దు. కేసీఆర్ కు ప్రజలపై ప్రేమ ఉంటే.... దోచుకుంటున్న 41 రూపాయలను మినహాయించుకోవాలి. అప్పుడు ప్రజలకు లీటర్ పెట్రోల్ 61 రూపాయలకే అందుబాటులోకి వస్తుంది. ఇకనైనా ప్రజలు టీఆర్ఎస్ మోసాలను గ్రహించాలి. టీఆర్ఎస్ ను చిత్తుచిత్తుగా ఓడించాలి.
Tags:    

Similar News