ఆర్కే న‌గ‌ర్ బైపోల్‌!... తీరు మార‌దంతే!

Update: 2017-12-17 11:28 GMT
త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలోని ఆర్కే న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం పేరు చెబితే చాలు... ఏడాది క్రిత సీఎం హోదాలోనే క‌న్న‌మూసిన ఆ రాష్ట్ర దివంగ‌త సీఎం - అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లితే గుర్తుకు వ‌స్తారు. త‌మిళ తంబీలంతా ఆప్యాయంగా అమ్మ‌గా పిలుచుకునే జ‌య మ‌ర‌ణించి అప్పుడే ఏడాది పూర్తి అయిపోయింది. అయితే ఆమె మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆర్కే న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి మాత్రం ఇప్ప‌టిదాకా ఎమ్మెల్యేగా ఏ ఒక్క‌రూ ఎన్నిక కాలేదు. ఎన్నిక కాలేదు అనే కంటే కూడా.. ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేదని చెప్పాలి. ఏ నియోజ‌క‌వ‌ర్గానికైనా ఆయా ప్ర‌జాప్ర‌తినిధులు మ‌ర‌ణించిన ఆరు నెల‌ల్లోగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొత్త ప్ర‌తినిధులు ఎన్నుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన పక్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం కేంద్రం ఎన్నిక‌ల సంఘం క‌స‌ర‌త్తు జ‌రుపుతున్నా... త‌మిళ తంబీలు మాత్రం ఎన్నిక‌లు నిర్వ‌హించలేని ప‌రిస్థితిని క‌ల‌గ‌జేస్తున్నారనే చెప్పాలి.

మొన్నామ‌ధ్య ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆర్కే న‌గ‌ర్ బైపోల్‌కు షెడ్యూల్ ప్ర‌కటించ‌గా... అధికార అన్నాడీఎంకేలో నెల‌కొన్న విభేదాలు ఆ ఎన్నిక‌ల‌ను మోర్ కాస్ట్‌లీగా మార్చేశాయి. ఒక్కో ఓటుకు ఏకంగా రూ.10 వేల వ‌ర‌కు ఖర్చు పెట్టేందుకు కూడా అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దిగిన నేత‌లు వెనుకాడ‌లేద‌నే చెప్పాలి. జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ మేన‌ల్లుడు టీవీవీ దినక‌ర‌న్ ఈ త‌ర‌హా డ‌బ్బు పంపిణీలో అడ్డంగా బుక్కైపోయార‌న్న వార్త‌లు కూడా వినిపించాయి. ఫ‌లితంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఎన్నిక‌ల సంఘం నాడు ఉప ఎన్నిక‌ల‌ను ఉన్న ప‌ళంగా వాయిదా వేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. షెడ్యూల్ ప్ర‌క‌టించిన త‌ర్వాత ఎన్నిక‌ల‌ను ఎందుకు ర‌ద్దు చేస్తున్నామ‌న్న విష‌యాన్ని కూడా ఎన్నిక‌ల సంఘం కాస్తంత క్లియ‌ర్ క‌ట్‌ గానే వివ‌రించింది. డ‌బ్బుల వ‌ద‌ర పారుతున్న ఆర్కే న‌గ‌ర్‌ లో ఉప ఎన్నిక‌ల‌ను ప్రశాంత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించలేని ప‌రిస్థితుల నేప‌థ్యంలోనే ఆ ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లుగా ప్ర‌క‌టించింది.

తాజాగా మ‌రోమారు షెడ్యూల్‌ ను ప్ర‌క‌టించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌కు రంగం సిద్ధం చేసింది. ఈ క్ర‌మంలో మ‌రోమారు అక్క‌డ డ‌బ్బుల మూట‌లు ప‌ట్టుబ‌డ‌టం పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న క్రమంలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 12.6 లక్షలను వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కొరుక్కుపేట్‌ లోని ఓ సైకోథెరపీ సెంటర్‌లో డబ్బు దాచారన్న సమచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొందరికి డబ్బులు ఇస్తున్నప్పుడు పట్టుకున్నారు.  ఇక ఇది దినకరన్ వర్గం పనేనంటూ అధికార పార్టీ ఆరోపణలు దిగటం.. ఇరు వర్గాల ఘర్షణకు దారితీయటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే యత్నం చేస్తున్నారు. గ‌తంలో మాదిరిగా ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తుండటంతో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనన్న చర్చ మొదలైంది. ఇప్పటిదాకా సుమారు 20 లక్షల దాకా డబ్బు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్ర‌కారం డిసెంబర్‌ 21న ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండగా.. 59 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
Tags:    

Similar News