నెక్స్టు వికెట్ రమణ్ సింగా?

Update: 2016-08-05 09:59 GMT
గుజరాత్ సీఎం ఆనందిబెన్ పటేల్ రాజీనామాతో అక్కడ కొత్త సీఎంను నిర్ణయించే పనిలో పడింది బీజేపీ. కొత్త సీఎం పేరు ప్రకటించడానికి ఎంతో సమయం లేదు. అయితే... ఈ సీఎంల మార్పిడి కేవలం గుజరాత్ తో ఆగేలా లేదని తెలుస్తోంది. మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ బీజేపీ మార్చబోతుందని సమాచారం. బీజేపీలోనూ ఈ ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. దీంతో నెక్ట్సు వికెట్ ఎవరన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ అంచనాలు వినిపిస్తున్న మొదటి పేరు ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ దే.

ఇప్పటికే ఆనందిబెన్ ను తొలగించిన బీజేపీ ఇప్పుడు రమణ్ సింగ్ పై కన్నేసిందని టాక్. 2003 నుంచి ఛత్తీస్ గఢ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్ సింగ్ ప్రభుత్వం గత రెండేళ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2018లో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రమణ్ సింగ్ స్థానంలోకొత్త ముఖ్యమంత్రిని వెతకాలని బీజేపీ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రమణ్ సింగ్ మూడుసార్లు వరుసగా సీఎం అయ్యారు. అయితే.. ఆరెస్సెస్ మాత్రం రమణ్ కు వ్యతిరేకంగా ఉంది. పైగా ఆరోపణలు వస్తుండడంతో వచ్చే ఎన్నికల నాటికి రమణ్ సింగ్ ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువవుతుందని భావిస్తున్నారు. దీంతో రమణ్ సింగ్ ను తప్పించాలని ఆరెస్సెస్ బీజేపీపై ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

కాగా బీజేపీ పెద్దల వద్ద రమణ్ సింగ్ కు మంచి పట్టు ఉంది. 1999 నుంచి 2003 వరకు కేంద్ర మంత్రిగా పనిచేసిన రమణ్ ఆ వెంటనే ఛత్తీస్ గఢ్ సీఎం అయ్యి అప్రతిహతంగా కొనసాగుతున్నారు. ఇప్పుడు మారిన సమీకరణలతో ఆయన పదవి ఊడనుందని తెలుస్తోంది. దీంతో ఒకప్పటి కాంగ్రెస్ లా బీజేపీ కూడా ముఖ్యమంత్రులను మార్చే కార్యక్రమం పెట్టుకుందా అన్న చర్చలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News