సుజనా ఇప్పుడే తేలుస్తారా? కాస్త ఆగుతారా?

Update: 2018-02-02 04:36 GMT
చంద్రబాబునాయుడు సర్కారు... కేంద్రంతో తెగతెంపులు చేసుకునే వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇది దశల వారీగా జరుగుతుందా? ఒకేసారి భాజపాతో బంధానికి రాంరాం చెప్పేస్తుందా? అనేది మాత్రమే ప్రస్తుతం మీమాంస. దశలవారీగా అంటే.. తొలుత కేంద్రంలో ఉన్న తమ పార్టీ మంత్రులతో రాజీనామా చేయించడం. ఆ తర్వాత రెండో అంచెగా.. కేంద్రంలోంచి తెలుగుదేశం బయటకు వస్తున్నట్లుగా ప్రకటించడం జరగవచ్చు. ఈ విషయంలో ఇప్పటికే పలు ఊహాగానాలు నడుస్తున్నాయి. అయితే తాజాగా ఢిల్లీ రాజకీయ వర్గాలు మరియు ఏపీ తెలుగుదేశం వర్గాల ద్వారా రాబడుతున్న సమాచారాన్ని బట్టి.. బంధం తెంచుకుంటే.. చంద్రబాబుకు కొన్ని ఝలక్ లు తప్పవని అనుకుంటున్నారు.

ఒకవేళ తెదేపా ఎన్డీయే కు నుంచి బయటకు వచ్చే పరిస్థితే వస్తే.. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న తెలుగుదేశం రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి..  తెదేపాను వీడి- తన మంత్రి పదవిని కాపాడుకునే అవకాశం ఉన్నదని కొందరు అంచనా వేస్తున్నారు. ఆయన తొలినుంచి రెండు పార్టీల మధ్య జరుగుతున్న వ్యవహారాలకు సంధాన కర్తగానే ఢిల్లీ దూతగానే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో భాజపా నాయకులతో చాలా సాన్నిహిత్యాన్ని పెంచుకున్న ఆయనకు.. ప్రస్తుతం తెదేపాలో గౌరవమూ - ప్రాధాన్యమూ పెద్దగా లేదని.. అదే సమయంలో ఈసారి టర్మ్ పూర్తయితే... మరోసారి రాజ్యసభకు పంపే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదని కూడా సంకేతాలు ఉన్నాయి.

అలాంటి నేపథ్యంలో భాజపాతో తెగతెంపులు అనే పరిస్థితే వస్తే గనుక.. సుజనా భాజపాలోకి ఫిరాయించి.. ఏపీలో ఆ పార్టీకి పెద్దదిక్కుగా మారవచ్చునని కొన్ని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఇప్పుడు సస్పెన్స్ ఏంటంటే.. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ఆశలను, ప్రజల నమ్మకాన్ని అవమానించడం అనేది ఇది తొలిసారి కాదు. మోడీ చెంబుడు నీళ్లు తెచ్చి మన అమరావతి ఆశల మీద చిలకరించిన నాటినుంచి ప్రజల గుండెలు రగులుతూనే ఉన్నాయి. అయితే సుజనా మాత్రం.. మోడీ సర్కారు అనుకూల ప్రకటనలతో వైఖరితో హోదా వదిలేయడం, ప్యాకేజీ ఒప్పందం తదితర విషయాల్లో వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.  అలా కుదిరిన బంధాన్ని వాడుకుని.. బాబు వారికి కటీఫ్ చెబితే.. వారి జట్టులో చేరి.. తన రాజకీయ ప్రస్థానాన్ని కాపాడుకునే వ్యూహంలో సుజనా ఉన్నట్టుగా కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ముందుముందు ఇంకా ఎన్ని ట్విస్టులు తిరుగుతాయో చూడాలి.
Tags:    

Similar News