రుషికొండ వివాదం : సుప్రీం మెట్లు ఎక్కిన ప్రభుత్వం

Update: 2022-05-26 14:09 GMT
విశాఖ సిటీలోని రుషికొండ ప్రాంతంలో రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్టుల విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ స్టే ఇచ్చిన సంగతి తెల్సిందే. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు అంటూ వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ మేరకు ఎన్జీటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం రుషికొండ నిర్మాణం పనులు నిలిపివేయాలని అదేశిస్తూ  ఈ నెల  11న మధ్యంతర స్టే విధించింది.

న్యూఢిల్లీలోని ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్ కూడా ప్రాజెక్ట్ యొక్క పర్యావరణ సాధ్యత మరియు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ క్లియరెన్స్‌లను పునఃసమీక్షించాలా వద్దా అనే దానిపై ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే తదుపరి విచారణ తేదీ వరకు ఏ రకమైన  నిర్మాణాలు చేపట్టకూడదు" అని ఎన్జీటీ  తెలిపింది, అయితే  రాష్ట్ర పర్యాటక శాఖ   కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

అయితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. స్పెషల్‌ లీవ్‌ పిటిషన్ను ఈ కేసు విషయంలో దాఖలు చేసి మరీ  స్టే ఇవ్వాలని కోరింది. అలాగే ఇది అత్యవసర కేసుగా భావించి విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం అర్ధించింది. దాన్ని ఈ రోజు సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును సోమవారం విచారణకు జాబితా చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

ఇదిలా ఉండగా రుషికొండ ప్రాజెక్టుల విషయంలో పట్టుదలగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అక్కడ చాలా కీలకమైన ప్రాజెక్టులను నిర్మించాలని భావిస్తోంది. అయితే ప్రచారంలో ఉన్న మాట ప్రకారం సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా అక్కడే వస్తుంది అని అంటున్నారు. అయితే ఈ మధ్య విశాఖ టూర్ కి వచ్చిన చంద్రబాబు రుషికొండ నిర్మాణాలను చూడాలనుకుంటే కూడా ఆయనకు అనుమతించలేదు.

దాంతో బాబు సైతం రాష్ట్ర ప్రభుత్వం తీరు మీద మండిపడ్డారు. ఇవన్నీ పక్కన పెడితే తమ పార్టీ నుంచి నెగ్గి రెబెల్ గా మారిన రఘురామ క్రిష్ణం రాజు ఇపుడు ఈ ప్రాజెక్టులను ఆపివేయించడం తో వైసీపీ మండుతోంది. దాంతో ఎలాగైనా సుప్రీం కోర్టు ద్వారా స్టే తీసుకురావడం ద్వారా ప్రాజెక్టు పనులను కొనసాగించాలని చూస్తోంది.

ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అన్ని రకాలైన పర్యావరణ అనుమతులు తమకు ఉన్నాయని, అయినా తమ వాదన వినకుండా  ఏకపక్షంగా ఎన్జీటీ మాజీ ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. మరి దీని మీద సుప్రీం కోర్టులో ఎలాంటి వాదనలను ఎన్జీటీ  వినిపిస్తోందో చూడాల్సి  ఉంది. మొత్తానికి రుషికొండ ప్రాజెక్టుల చుట్టూ రాజకీయ మేఘాలు అలుముకున్నాయి. మరి వీటిని తొలగించడం జరుగుతుందా లేదా అన్నది చూడాలి.
Tags:    

Similar News