వీటో అధికారంతోనే రష్యా మారణహోమం

Update: 2022-04-06 07:53 GMT
ఐక్యరాజ్యసమితిలో వీటో అనేది పవర్ ఫుల్ అధికారం. భద్రతా మండలిలో చోటు దక్కించుకున్న దేశాలకు ఈ అస్త్రం ఒక ఆయుధం లాంటిది. ఇప్పుడు దాన్నే ప్రయోగించి రష్యా చెలరేగిపోతోందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్ స్కీ ఆవేశపూరితంగా ప్రసంగించాడు. రష్యా సైన్యం తమ దేశంలో  అత్యంత హేయమైన యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తక్షణమే స్పందించాలంటూ భద్రతా మండలిని కోరాడు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఉద్దేశించి మంగళవారం రాత్రి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. బుచాలో రక్తమోడుతూ కాలి బుగ్గిగా మారిన కనిపించిన శవాల కుప్పలకు సంబంధించిన వీడియోను జెలెన్ స్కీ ప్రదర్శించాడు.తక్షణమే స్పందించాలని లేదంటే మొత్తంగా మిమ్మల్ని మీరు పూర్తిగా రద్దు చేసుకోండి అంటూ ఐరాస భద్రతా మండలిని ఉద్దేశించి జెలెన్ స్కీ ఆవేశంగా ప్రసంగించాడు. ఐసిస్ కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో రష్యా బలగాలు ఉక్రెయిన్ లో మారణహోమానికి పాల్పడ్డాయన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు.. రష్యాను వెలివేయాలని డిమాండ్ చేశాడు. తద్వారా వీటో అధికారాన్ని రష్యాకు లేకుండా చేయాలని కోరాడు.

ఒకవేళ ప్రత్యామ్మాయం, ఇతర దారులు లేకుంటే.. మొత్తంగా భద్రతా మండలి, ఐక్యరాజ్యసమితి రద్దు చేసుకోవాలంటూ జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుచాలో రష్యా దళాలు ప్రతి పౌరుడిని వెతికి వెతికి చంపారని.. ఉగ్రవాదుల కంటే కిరాతకంగా ప్రవర్తించాయని ఆరోపించారు.

భద్రతా మండలిలో వీటో అధికారమున్న శాశ్వత సభ్యదేశం రష్యా మమ్మల్ని చంపేందుకు హక్కుగా.. లైసెన్స్ గా వాడుకుంటోందని జెలెన్ స్కీ అన్నారు. ప్రపంచ భద్రతకే ఇదో సవాల్ అన్నారు. ఇలాంటి వాటిని అరికట్టేలా తక్షణం ఐరాస వ్యవస్థను సంస్కరించాలని వాదించారు.

ఇక ఐరాసలోని రష్యా అంబాసిడర్ వెసెలీ నెబెంజియా  ఉక్రెయిన్ అధ్యక్షుడు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్ లో రష్యా బలగాలు దమనకాండకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఉంటే సమర్పించండని హితవు పలికారు. ఇదంతా ఉక్రెయిన్ ఆడుతున్న నాటకం అంటూ ప్రత్యారోపణలు చేశారు.

ఇక ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ స్పందించారు. ఈ యుద్దం వల్ల ఇప్పటికే 74 దేశాలు, బిలియన్ న్నర మంది సంక్షోభంలోకి కూరుకుపోయారని మెచ్చరించారు. తక్షణం యుద్ధం ఆపాలంటూ పిలుపునిచ్చారు.
Tags:    

Similar News