రష్యా టార్గెట్ చేరుకున్నట్లేనా ?

Update: 2022-03-24 06:30 GMT
నెలరోజుల ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా ఏమి సాధించింది ? తాను అనుకున్నట్లుగా టార్గెట్ రీచయ్యిందా ? ఇప్పుడు ఇదే అంశంపై  యావత్ ప్రపంచాన్ని ఆలోచిస్తోంది. యుద్ధం మొదలై ఈ రోజుకు సరిగ్గా నెల రోజులు. ఫిబ్రవరి 24వ తేదీన మొదలైన యుద్ధం మెల్లిగా తీవ్రరూపందాల్చింది. ఎంత తీవ్రరూపం దాల్చినా ఇంకా నూరుశాతం ఉక్రెయిన్ పై రష్యాకు పట్టు చిక్కలేదన్నది వాస్తవం. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను ఇంకా రష్యా సైన్యం పట్టుకోలేదు.

ఇదే సమయంలో కీలక నగరాలైన ఖర్కీవ్, మారియా పోల్, ఖర్సీవ్ లాంటి నగరాలపై రష్యా కాస్త పట్టు సాధించింది. కీలకమైన అణువిద్యుత్ కేంద్రాలు, నల్లసముద్రంలోని పోర్టుసిటిని రష్యా సైన్యాలు ఆక్రమించుకున్నాయి. బయట ప్రపంచంతో ఉక్రెయిన్ సముద్ర మార్గంపై రష్యా పట్టు సాధించింది. ఉక్రెయిన్ పై రష్యా నూరుశాతం పట్టు సాధించిందా అంటే సాధించిందని చెప్పేందుకు లేదు.

అలాగని యుద్ధంతో రష్యా ఏమి సాధించిందని విశ్లేషించుకుంటే ఉక్రెయిన్లోని చాలా నగరాలను రష్యా సైన్యం ధ్వంసం చేసేసింది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారమే సుమారు 50 లక్షల మంది ఉక్రెయిన్ నుండి వలసలు వెళ్ళిపోయారు. వివిధ నగరాల్లోని ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యాలయాలు నేలమట్టమైపోయాయి. యూరోపులోనే అత్యంత పెద్దదైన ఉక్కు ఫ్యాక్టరీని రష్యా సైన్యం నేలమట్టం చేసేసింది. ఇదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తనకు సరెండర్ అయ్యేట్లుగా రష్యా ఒత్తిడి పనిచేసిందని అంగీకరించాలి.

మొత్తానికి నెలరోజుల యుద్ధంలో రష్యా టార్గెట్ రీచయ్యిందా అని చూసుకుంటే లేదనే చెప్పాలి. ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోలేకపోవటం, అధ్యక్షుడు జెలెన్ స్కీని పట్టుకోలేకపోయిన విషయంలో రష్యా ఫెయిలైందనే చెప్పాలి. కాకపోతే ఉక్రెయిన్లోని చాలా నగరాల్లో విధ్వంసం సృష్టించటం ద్వారా అపారమైన నష్టాన్ని కలగచేసిందనేది మాత్రం వాస్తవం. నెలరోజుల యుద్ధంలో చారిత్రక, వారసత్వ నిర్మాణాలకు అపారమైన నష్టాలు జరగటమే కాకుండా ఆర్ధికంగా హోలు దేశమే పూర్తిగా దెబ్బతినేసిందన్నది వాస్తవం. ఇదే సమయంలో రష్యా సైనికులు కూడా సుమారుగా 15 వేలమంది చనిపోయారు. కాబట్టి ఇక్కడ నష్టపోయింది ఉక్రెయినే కాదు రష్యా కూడా ఏదోరూపంలో నష్టపోయిందనే చెప్పాలి.
Tags:    

Similar News