పాపం..రష్యా నుంచి వచ్చి బిచ్చమెత్తుకుంటున్నాడు

Update: 2017-10-11 08:01 GMT
అతను రష్యా దేశస్థుడు. మన దేశం చూద్దామని వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చాక అతడి ఏటీఎం పని చేయలేదు. చేతిలో డబ్బుల్లేవు. ఎవరినడిగినా సాయం చేయలేదు. అతణ్ని నమ్మలేదు. దీంతో గుడి మెట్ల దగ్గర కూర్చుని అడుక్కోవడం మొదలుపెట్టాడు. దయనీయ స్థితికి చేరుకున్న అతడి గురించి మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలిసింది. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సైతం అతడి విషయమై స్పందించారు. తనకు సాయం చేసి స్వదేశానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. ఆ వ్యక్తి పేరు పేరు.. ఇవాంజెలిన్. 24 ఏళ్ల ఇవాంజెలిన్ మన దేశం చూద్దామని కొన్ని రోజుల కిందట ఇండియాకు వచ్చాడు.

తమిళనాడులో దేవాలయాలు ఫేమస్ అని ఆ రాష్ట్రమంతా తిరగాలని నిర్ణయించుకున్నాడు. ఐతే కాంచీపురంలోని కుమరకొట్టం అనే ఆలయానికి చేరుకున్నాక అతడి ఏటీఎం కార్డు పని చేయడం మానేసింది. అక్కడి వాళ్లవెరూ అతడికి సాయం చేయలేదు. దీంతో ఆకలి తీర్చుకోవడం కోసం ఆ గుడి మెట్ల దగ్గరే అడుక్కోవడం మొదలుపెట్టాడు. భక్తుల ద్వారా తర్వాత ఈ విషయం స్థానిక పోలీసులకు తెలిసింది. వాళ్లు కొంత ధనసాయం చేశారు. తర్వాత చెన్నైకి వెళ్లి రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. అతడి డాక్యుమెంట్లు.. వీసా.. పాస్ పోర్ట్ అన్నీ సరిగ్గానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా సుష్మా స్వరాజ్ కు తెలియడంతో.. ఆమె స్పందించారు. రష్యా తమ మిత్ర దేశమని.. చెన్నైలోని తమ అధికారి మీకు సహకరిస్తాడని ఇవాంజెలిన్ ను ఉద్దేశించి సుష్మా ట్వీట్ చేసింది. దీంతో అతడి కథ సుఖాంతమైనట్లే కనిపిస్తోంది.
Tags:    

Similar News