అమ‌రావ‌తిని వాళ్లు రౌండ‌ప్ చేస్తార‌ట‌

Update: 2017-06-23 09:54 GMT
ప్ర‌పంచం చూపును ఆకర్షించేలా క‌ల‌ల రాజ‌ధాని నిర్మిస్తాన‌ని చెప్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం మూడేళ్లుగా రాజ‌ధాని నిర్మాణాన్ని ఇంకా ఆచ‌ర‌ణ రూపంలోకి తీసుకురాని సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికీ డిజైన్ల ఆమోదం ద‌శ‌లోనే రాజ‌ధాని నిర్మాణం ఉండ‌టం అనేక మంది టీడీపీ అభిమానులను కూడా క‌లిచివేస్తోంద‌నే ప్ర‌చారం ఉంది. మ‌రోవైపు పెద్ద ఎత్తున భూసేక‌ర‌ణ చేసినప్ప‌టికీ రైతులంద‌రికీ పున‌రావాసం, ప‌రిహారం ఇవ్వ‌లేక‌పోవ‌డం వంటి ప‌రిస్థితులు సైతం ఇబ్బందిక‌రంగా మారాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా అమ‌రావ‌తి వేదిక‌గా కొత్త ఆందోళ‌న మొద‌లైంది. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలోని రైతుల స్థితిగతులను తెలుసుకొనేందుకు, ఆ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులు జూలై8న 'ఛలో అమరావతి' కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు.

సీనియ‌ర్ పాత్రికేయులు - వ్య‌వ‌సాయ‌రంగ నిపుణులు - రైతు సంఘాల - ప్రజా సంఘాలు క‌లిసి చ‌లో అమ‌రావ‌తికి శ్రీ‌కారం చుట్టాయి. తాజాగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో మాజీ వ్య‌వ‌సాయ‌శాఖ‌ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు - రైతు సంఘాల నేతలు ఆనుమోలు గాంధీ -సామాజిక కార్యకర్త బొలిశెట్టి సత్యన్నారాయణ త‌దిత‌రులు మీడియాతో మాట్లాడుతూ ఏపీ నూతన రాజధాని అమరావతి కోసం రైతుల నుంచి బ‌ల‌వంతంగా భూములను తీసుకోవడం వల్ల వారు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింద‌ని ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రజల భూములను సేకరించి వ్యాపారంగా మార్చేస్తోందని మండిపడ్డారు. స్థానికంగా ఉండే రైతుల‌కు పనులు లేకుండా పోయాయ‌ని, రైతు కూలీల‌కు ఉపాధిక‌రువైంద‌ని అన్నారు. అందుకే స్థానిక రైతుల‌ను క‌లుపుకొని ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, స్థానికుల‌కు మెరుగైన జీవన ప్ర‌మాణాలు అందించేందుకు ఉద్య‌మం లేవ‌దీస్తామ‌ని తెలిపారు.

మాజీ వ్య‌వ‌సాయ శాఖా మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ ఏపీ రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన రైతుల భూములను కాంక్రీటు జంగిల్‌ గా మార్చడం సరికాదన్నారు. ఏడాది పొడవునా పండే పంట భూములను రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్‌ జోన్‌ గా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రైతు సంఘం నేత కాకాజీ మాట్లాడుతూ అమరావతిలో రైతుల భూములను లొక్కొని ప్రభుత్వం కార్పొరేట్లకు దోచిపెడుతుందని విమర్శించారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌ కు సంబంధించిన విషయమే కాదని, దేశంలో అన్ని ప్రాంతాలకు వర్తించే ప్రమాదముందని హెచ్చరించారు. సీనియర్‌ పాత్రికేయులు కులదీప్‌ నయ్యర్‌ - విక్రమ్‌ - సోనీ - రాజేంద్ర సింగ్‌ లు అమరావతిలో పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న ఉద్యమానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. వివిధ వ‌ర్గాల స‌మ‌న్వ‌యంతో చ‌లో అమ‌రావతి చేప‌ట్టి క్షేత్ర‌స్థాయిలోని ప‌రిస్థితుల‌ను అధ్య‌యనం చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News