కాంగ్రెస్ కు అల్లాటప్పా షాక్ కాదు ఇది!

Update: 2019-03-10 09:59 GMT
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇది అల్లాటప్పా షాక్ కాదు. గత టర్మ్ లో గెలిచిన వాళ్లు ఫిరాయించిన, ఇటీవలి నెగ్గిన వారు ఫిరాయించినా.. కాంగ్రెస్ అధిష్టానానికి కానీ, తెలంగాణలో ఆ పార్టీ అభిమానులకు కానీ కలగనంత విస్మయం ఇప్పుడు కలుగుతోంది. మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెరాసలోకి చేరబోతున్నారనే వార్త కాంగ్రెస్  పార్టీలో కలవరం పుట్టిస్తూ ఉంది.

ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మహామహులు ఓడిపోగా.. తెరాస వేవ్ లోనూ గెలిచి నిలిచి సత్తా చూపించిన సబితమ్మ ఇప్పుడు కేసీఆర్ పార్టీలోకి చేరబోతున్నారనే వార్తకు మించి కాంగ్రెస్ అభిమానులకు కూడా ఇంక మరేం షాక్ ఉంటుంది. ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి.

టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడా సబిత సమావేశం జరిగినట్టుగా సమాచారం. తెరాసకు ఆప్తుడిగా ఉన్న అసదుద్ధీన్ ఒవైసీ వీరి మీటింగుకు ముందు సంధి కుదిర్చినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఒవైసీ ఇళ్లు వేదికగానే వీరి భేటీ జరిగినట్టుగా తెలుస్తూఉంది. ఇప్పటికే సబిత తనయుడు కార్తీక్ రెడ్డి.. అనుచవర్గంతో సమావేశాలు ఏర్పాటు చేశారని.. అంతా కూడగట్టుకుని తెరాసలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా సమాచారం.

కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగానే ఉన్నారు సబితా ఇంద్రారెడ్డి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఆమె తనయుడు కార్తిక్ రెడ్డి కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే .. అది జరగలేదు. అధిష్టానం టికెట్ ఖరారు చేయకపోయినా.. తాము ఇండిపెండెంట్ గా బరిలో నిలవడానికి సై అని కార్తిక్ రెడ్డి ప్రకటించారు మొదట. అయితే ఆ తర్వాత సర్ధి చెప్పారు.

ఇక ఎన్నికల అనంతరం సీఎల్పీ నేత ఎన్నిక విషయంలో కూడా సబిత అసంతృప్తితో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఆమె సీఎల్పీ  అధ్యక్ష పదవిని ఆశించారు. అది కూడా దక్కలేదు. మొత్తానికి ఏదో  కొద్ది మంది అయినా నెగ్గి తెలంగాణలో కాంగ్రెస్ ఉనికిని అయినా చూపించారనుకుంటే.. లోక్ సభ ఎన్నికల ముందు ఇలా వారు కూడా జంప్ అయిపోతూ ఉండటం కాంగ్రెస్ పార్టీలో కలవరాన్ని పుట్టిస్తోంది!
Tags:    

Similar News