స‌బిత యూట‌ర్న్‌!... అంత‌లోనే మ‌రో ట‌ర్న్‌!

Update: 2019-03-12 17:37 GMT
ఉమ్మ‌డి రాష్ట్రంలోనే కీల‌క రాజ‌కీయ నేత‌గా ఎదిగిన మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విష‌యంలో మొన్న‌టి నుంచే లెక్క‌లేన‌న్ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగిన స‌బిత‌... దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌ రెడ్డి హ‌యాంలో ఏకంగా హోం మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టి స‌త్తా చాటారు. వైఎస్ కు అత్యంత స‌న్నిహితురాలిగా - చేవెళ్ల చెల్లెమ్మ‌గా ప్ర‌సిద్ధికెక్కిన స‌బిత‌... తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోవ‌డం - రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అంత‌కంత‌కూ ప‌డిపోతుండ‌టం - అయినా కూడా ఆది నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న త‌మ‌కు ప్రాధాన్యం ద‌క్క‌క‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో స‌బిత ఇప్పుడు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఇటీవ‌లే మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఇంటిలో టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో స‌బిత భేటీ అయిన‌ట్టుగా వెలువ‌డ్డ వార్త‌లు తెలంగాణ‌లో పెను క‌ల‌క‌ల‌మే రేపాయి. టీఆర్ ఎస్‌ లో చేరేందుకే స‌బిత నిర్ణ‌యం తీసుకున్నార‌ని కూడా ప్ర‌చారం సాగింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు టీఆర్ ఎస్‌ కు షాకిచ్చి... కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డికి ప్రాధాన్యం ఇవ్వ‌డంతో పాటుగా ఈ ద‌ఫా చేవెళ్ల టికెట్ ను ఆయ‌న‌కే కేటాయించిన నేప‌థ్యంలోనే స‌బిత టీఆర్ ఎస్ వైపు మొగ్గు చూపిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సూచ‌న‌ల‌తో అప్ప‌టిక‌ప్పుడు రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి - జానా రెడ్డి - ష‌బ్బీర్ అలీలు స‌బిత‌తో విడ‌త‌ల‌వారీగా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ క్ర‌మంలో టీఆర్ ఎస్‌ లో చేరాల‌న్న త‌న నిర్ణ‌యాన్ని స‌బిత మార్చుకున్నార‌ని - కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతార‌ని - దీనికంత‌టికి రేవంత్ మంత్రాంగ‌మే కార‌ణ‌మంటూ నేటి ఉద‌యం నుంచి పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. అయితే మ‌రోమారు కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన స‌బిత‌... టీఆర్ ఎస్‌ లో చేరేందుకే తుది నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు త‌న నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అయిన స‌బిత‌... ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

అంటే... తొలుత ట‌ర్న్ తీసుకున్న స‌బిత‌... రేవంత్ చ‌క్రం తిప్ప‌డంతో యూట‌ర్న్ తీసుకున్నార‌ని - ఆ త‌ర్వాత తిరిగీ మ‌రోమారు ట‌ర్న్ తీసుకున్నార‌ని చెప్పాలి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ముందుగా చెప్పుకున్న‌ట్టుగా రేవంత్ రెడ్డి చ‌క్ర‌మేమీ తిర‌గలేద‌ని - చివ‌ర‌కు రాహుల్ గాంధీతో ఫోన్ లో మాట్లాడించినా కూడా స‌బిత వెన‌క్కు త‌గ్గ‌లేద‌న్న విష‌యం ఇప్పుడు నిజంగానే ఆసక్తి క‌లిగిస్తోంది. త‌న‌కు తెలంగాణ‌లో మంత్రి ప‌ద‌వితో పాటు ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌న కుమారుడికి చేవెళ్ల ఎంపీ టికెట్ల‌పై టీఆర్ ఎస్ నుంచి హామీ ల‌భించ‌డంతో స‌బిత ఆ దిశ‌గా ప్ర‌యాణం సాగిస్తున్న‌ట్లుగా స‌మాచారం. మొత్తంగా ఇప్ప‌టికే గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు చేజారిన కాంగ్రెస్‌ కు ఇప్పుడు స‌బిత మ‌రో గ‌ట్టి దెబ్బ కొట్ట‌బోతున్నార‌న్న మాట‌.
Tags:    

Similar News