27 ఏళ్ల క్రితం ఇదే రోజు ఒక అద్భుతం

Update: 2016-11-15 16:54 GMT
 1989 న‌వంబ‌రు 15.. భార‌త క్రికెట్ అభిమానులు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని రోజిది. ఆ మాట‌కొస్తే ప్ర‌పంచ క్రికెట్ ప్రియులంద‌రూ కూడా ఈ తేదీని గుర్తుంచుకోవాల్సిందే. ఎందుకంటే ఆ రోజు స‌చిన్ తెందుల్క‌ర్ అంత‌ర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. నూనూగు మీసాల కుర్రాడిగా 16 ఏళ్ల వ‌య‌సులోనే భార‌త జ‌ట్టులోకి ఎంపిక‌య్యాడు క్రికెట్ దేవుడు. ఈ రోజుతో అత‌ను క్రికెట్లోకి అరంగేట్రం చేసి స‌రిగ్గా 27 ఏళ్ల‌యింది.

చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్ మీద‌ కరాచిలో స‌చిన్ అరంగేట్రం చేయ‌డం విశేషం. మొద‌ట ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ బ్యాటింగ్ చేసింది. దీంతో తొలి రోజే స‌చిన్ మైదానంలోకి ఫీల్డ‌ర్ గా అడుగుపెట్టాడు. రెండో రోజు స‌చిన్ కు బ్యాటింగ్ చేసే అవ‌కాశం ల‌భించింది. ఆ మ్యాచ్ లో అతను 15 పరుగులకే ఔట‌య్యాడు. ఐతే అదే సిరీస్ లో స‌చిన్ త‌ర్వాత చెల‌రేగాడు. వ‌కార్ యూన‌స్ బౌన్స‌ర్ త‌గిలి ర‌క్తం కారినా వెర‌వ‌కుండా నిల‌బ‌డ్డాడు. అబ్దుల్ ఖాదిర్ బౌలింగ్ లో సిక్స‌ర్ల మోత మోగించాడు.

ఇక ఆ త‌ర్వాత స‌చిన్ ప్ర‌యాణం ఎలా సాగిందో అంద‌రికీ తెలిసిందే. స‌రిగ్గా 24 ఏళ్ల‌కు త‌న సుదీర్ఘ ప్ర‌యాణాన్ని ముగిస్తూ  2013 నవంబర్ 14న త‌న కెరీర్ కు గుడ్ బై చెప్పాడు స‌చిన్‌. మొత్తం 200 టెస్టులు ఆడి 15,921 పరుగులు చేశాడు స‌చిన్‌. అందులో 51 శతకాలు..68 అర్ధ శతకాలు నమోదు చేశాడు. మొత్తం 100 అంత‌ర్జాతీయ సెంచ‌రీలు బాదిన ఏకైక ఆట‌గాడు అత‌నే. ఇంకా ఎన్నెన్నో రికార్డులు అత‌డి సొంతం.
Tags:    

Similar News