సచిన్ పరువు గంగలోకి..

Update: 2017-08-04 04:57 GMT
సచిన్ టెండూల్కర్ గొప్ప క్రికెటర్ కావచ్చు.. క్రికెట్ కెరీర్లో అతడెన్నో ఘనతలు సాధించి ఉండొచ్చు. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి ఉండొచ్చు. కానీ రాజ్యసభ సభ్యుడిగా మాత్రం సచిన్ ఒక బిగ్ ఫెయిల్యూర్. ఎంపీగా డీఫాల్ట్ గా చేయాల్సిన కొన్ని కార్యక్రమాలైతే చేస్తున్నాడు కానీ.. ఆ పదవిలో ప్రధానమైన బాధ్యతల్ని మాత్రం పూర్తిగా విస్మరించాడు సచిన్. పార్లమెంటుకు హాజరయ్యే విషయంలో పేలవమైన రికార్డు అతణ్ని జీరోను చేసేసింది.

2012లో ఎంపీగా బాధ్యతలందుకున్న సచిన్.. ఇప్పటిదాకా జరిగిన పార్లమెంటు సెషన్లలో 7 శాతం మాత్రమే అటెండెన్స్ మెయింటైన్ చేయడం గమనార్హం. ఈ విషయమై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఒకరు మొన్న గట్టిగా గళం విప్పారు. సచిన్ తో పాటు ఆయనకంటే పేలవమైన అటెండెన్స్ ఉన్న రేఖను సైతం ఎంపీ పదవుల నుంచి డిస్మిస్ చేయాలని సభలో డిమాండ్ చేశాడు. దీనిపై రాజ్యసభలో కొంత చర్చ కూడా నడిచింది.

దీంతో మరుసటి రోజుకే సచిన్ వెళ్లి రాజ్యసభలో ప్రత్యక్షమయ్యాడు. అయినా అతడిపై విమర్శలు ఆగలేదు. సచిన్ రాజ్యసభలో కనిపించడం మీద సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో ట్రాలింగ్ జరిగింది. మరోవైపు టీవీల్లో అతనే ప్రధాన చర్చగా మారాడు. అర్నాబ్ గోస్వామి నడిపించే ‘రిపబ్లిక్’ టీవీలో అతణ్ని ఓ ఆట ఆడేసుకున్నారు. సచిన్ ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సిందేనంటూ అతను పెద్ద చర్చను నడిపించాడు. ఈ చర్చకు హాజరైన వాళ్లంతా సచిన్ మీద ధ్వజమెత్తారు.

అతను పార్లమెంటును ఇన్సల్ట్ చేస్తున్నాడని.. అతడికి చట్ట సభల మీద ఏమాత్రం గౌరవం లేదని.. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓవైపు తన బయోపిక్ చేసుకోవడానికి.. అడ్వర్టైజ్మెంట్లు చేయడానికి.. లండన్ వెళ్లి వింబుల్డన్ మ్యాచులు చూసి రావడానికి టైం ఉంది కానీ.. పార్లమెంటుకు రావడానికి సమయం లేదా అంటూ అతడిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా సచిన్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలా అంటూ పోల్ పెడితే.. 92 శాతం మంది అనుకూలంగా ఓట్ చేయడం విశేషం. మరోవైపు సోషల్ మీడియాలో సచిన్ కు వ్యతిరేకంగా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి పెద్ద ఎత్తున అతణ్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
Tags:    

Similar News