సజ్జల చేతికి సోషల్ మీడియా....పదునెక్కనుందా...?

Update: 2022-09-06 23:30 GMT
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మౌత్ పీస్ గా పేరు పొందిన వారు ఆయన. అంతేనా సకల శాఖలకు మంత్రిగా కూడా కీర్తించబడుతున్నారు. ఎవరు ఏ పొజిషన్ లో ఉంటేనేంటి ఆయన మాత్రం అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో అందరి కంటే అత్యంత శక్తిమంతుడు. ఈ విషయంలో ఎవవికీ రెండవ అభిప్రాయం అయితే లేదు. ఆయనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి.

ఈయన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా కూడా ఉంటున్నారు. ఇక జగన్ కి కుడి భుజంగా ఉంటున్నారు. ఇపుడు ఆయన చేతికే వైసీపీ సోషల్ మీడియా వింగ్ ని అప్పగించార‌ని జగన్ నిర్ణయించారన్నది తాజా టాక్. గత మూడేళ్ళ వైసీపీ పాలనలో అధికారపు వెలుగులలో సోషల్ మీడియా వింగ్ బాగా బక్కచిక్కిపోయింది. పైగా ఒక నియంత్రణ కానీ పర్యవేక్షణ కానీ ఏదీ లేకుండా పోయింది.

అంతే కాదు అధికారంలోకి తమ పార్టీ వచ్చేసింది అని అతి ఉత్సాహంతో కొందరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగులు వారిని ఇబ్బందిలోకి నెట్టాయి. ఏకంగా కోర్టు తీర్పుల మీద జడ్జీల మీద కొందరు పెట్టిన వివాదాస్పద పోస్టింగుల కారణంగా కటకటాల వెనక్కి కూడా వెళ్లాల్సి వచ్చింది. అంతే కాదు సీబేఐ విచారణను మరి కొందరు ఎదుర్కొన్నారు. ఇలాన్ వైసీపీ సోషల్ మీడియా ఒక దశ దిశ లేకుండా ఉన్న నేపధ్యంలో టీడీపీ బాగా బలం పుంజుకుంది.

జగన్ మీద ఆయన పార్టీ మీద ప్రభుత్వం మీద అద్భుతమైన కంటెంట్ తో క్షణాలలో సోషల్ మీడియాలో పోస్టింగుల పెట్టే మెరికల్లాంటి సైన్యమే టీడీపీకి ఇపుడు ఉంది. ఒక విధంగా చూస్తే సోషల్ మీడియా వింగ్  రేసులో టీడీపీ చాలా దూరం వెళ్ళిపోయింది. ప్రభుత్వ వైఫల్యాలను ఇప్పటికే జనంలో చర్చకు పెట్టి ఆ పార్టీకి రావాల్సిన పొలిటికల్ మైలేజిని సొంతం చేసుకుంటోంది.

ఇక జనసేన ఎటూ సినీ నటుడు పవన్ కళ్యాణ్ ది. ఆయన విషయంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎంత రచ్చ చేస్తారో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితుల్లో ఎవరూ పట్టించుకోక ఏమీ కాకుండా మిగిలి ఉన్నది వైసీపీ సోషల్ మీడియా వింగ్ మాత్రమే. ఇపుడు ఎన్నికలు దగ్గరలోకి వచ్చేశాయి. దాంతో వైసీపీకి కూడా అర్జంట్ గా సోషల్ మీడియా గుర్తుకు వచ్చింది అని అంటున్నారు.

ఎటూ సజ్జల ట్రెడిషనల్ మీడియా వ్యవహారాలను చూస్తున్నారు కాబట్టి ఆయన చేతికే సోషల్ మీడియా వింగ్ ని కూడా అప్పగిస్తే బాగుంటుంది అని హై కమాండ్ అంచనాకు వచ్చిందట. దాంతో సజ్జల ఇక మీదట సోషల్ మీడియా బాధ్యతలను తీసుకుని పరుగులు తీయిస్తారు అని అంటున్నారు. ఈ మధ్యనే అంటే గత వారంలో తాడేపల్లి కార్యాలయంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో సోషల్ మీడియా విభాగం  వర్క్‌షాప్ ను సజ్జల ఆద్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా వివాదాలకు చోటు లేకుండా పార్టీ ప్రభుత్వం ప్రతిష్ట పెంచేలా పోస్టింగులు ఎలా పెట్టాలి అన్న దాని మీద సజ్జల క్లాస్ తీసుకున్నారని భోగట్టా. ఇక రానున్న రోజుల్లో సోషల్ మీడియా ద్వారా ఉధృతంగా ప్రచారం ఎలా నిర్వహించాలో కూడా సజ్జల సూచనలు చేశారని అంటున్నారు. అంతే కాదు సోషల్ మీడియా వింగ్ కి మరిన్ని బాధ్యతలను అప్పగించడం వారి మీద పూర్తి ఫోకస్ పెట్టడం వంటివి చేయడానికి కూడా వైసీపీ రెడీగా ఉందిట. ఇక సజ్జల చేతిలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఎంత మేరకు పదునెక్కుతుందో చూడాలని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News