స‌జ్జ‌నార్ సార్‌.. గ‌మ‌నిస్తున్నారా..?

Update: 2021-12-10 08:30 GMT
స‌జ్జ‌నార్.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు. తెలుగు ప్ర‌జ‌ల‌కు అంత‌గా గుర్తుండిపోయారు. ఒక్క సంఘ‌ట‌న‌తో దేశ‌వ్యాప్తంగా ఆయ‌న‌ పేరు మారుమోగిపోయింది. పోలీస్ అధికారిగా రాష్ట్రంలో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చారు. దిశ ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న‌తో యువ‌త‌కు ఆరాధ్య దైవంగా మిగిలిపోయారు.

దీంతో స‌జ్జ‌నార్ సేవ‌ల‌ను గుర్తించిన ప్ర‌భుత్వం న‌ష్టాల‌తో కునారిల్లుతున్న ఆర్టీసీకి ఎండీగా నియ‌మించింది. మూత‌దిశ‌గా వెళుతున్న సంస్థ‌ను తిరిగి గాడిలో పెట్టాల్సిందిగా స‌జ్జ‌నార్‌కు టాస్క్ విధించింది. దీంతో ఆర్టీసీ ఎండీగా బాధ్య‌త‌లు చేప‌ట్టి.. వ‌చ్చీ రావ‌డంతోనే త‌న‌దైన శైలి చూపించారు.

న‌ష్టాల బాట‌లో ప‌య‌నిస్తున్న ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు సుదీర్ఘ అధ్య‌య‌నం చేశారు. తొలుత సాధార‌ణ ప్ర‌యాణికుల మాదిరిగా బ‌స్సుల్లో ప్ర‌యాణించారు. త‌న ట్విట‌ర్‌కు వ‌చ్చే ఫిర్యాదుల ఆధారంగా ప్ర‌యాణికుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించారు.

ఆ త‌ర్వాత పెళ్లిళ్ల‌కు బ‌స్సుల బుకింగ్స్ పెరిగేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. త‌న సిబ్బంది ద్వారా వ‌ధూవ‌రుల‌కు బ‌హుమ‌తులు ఇచ్చే ప్ర‌ణాళిక మొద‌లుపెట్టారు. దీంతో ప్ర‌యాణికుల్లో స‌జ్జ‌నార్ ప‌ట్ల మంచి అభిప్రాయం ఏర్ప‌డింది.

ఆ త‌ర్వాత అధికారుల‌కు ప‌రీక్ష పెట్టారు. ప్ర‌తి గురువారం ఆర్టీసీ అధికారులు ప్ర‌యాణికుల మాదిరిగా బ‌స్సుల్లో ప్ర‌యాణించాల‌ని ఆదేశించారు. ఎలాగైనా బ‌స్సులు నిండి ఆక్యుపెన్సీ పెరిగి లాభాల బాట‌లో ప‌య‌నించేలా చూడాల‌న్నారు. ఇప్పుడు మ‌రో ప్ర‌య‌త్నం చేశారు. ఏకంగా బ‌స్సుల్లో పుట్టిన ఆడ‌పిల్ల‌ల‌కు జీవిత‌కాలం ప్ర‌యాణం చేసే అవ‌కాశం క‌ల్పించారు.

ఇటీవ‌ల నాగ‌ర్‌క‌ర్నూలు, ఆసిఫాబాద్ డిపోల‌కు చెందిన బ‌స్సుల్లో ఆడ‌పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన వారికి ఆర్టీసీ సిబ్బంది స‌హ‌క‌రించారు. దీనిని అరుదైన ఘ‌ట‌న‌గా భావించిన ఎండీ స‌జ్జ‌నార్ ఆ శిశువులు జీవిత‌కాలం ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణించేందుకు అనుమ‌తి క‌ల్పించారు. దీంతో ప్ర‌యాణికులు స‌జ్జ‌నార్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.

ఇంత వ‌రకు బాగానే ఉన్నా.. వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న ఆద‌ర్శ‌నీయంగా ఉన్నా అస‌లు బ‌స్సులే లేన‌ప్పుడు ఇవ‌న్నీ ఎంత‌వ‌ర‌కు పూర్థి స్థాయిలో స‌క్సెస్ అవుతాయ‌ని మ‌రికొంద‌రు ప్ర‌యాణికులు ప్ర‌శ్నిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందున్న సంఖ్య‌లో బ‌స్సులు ఇప్ప‌డు లేవ‌ని.. హైద‌రాబాద్ న‌గ‌రంలో, రాష్ట్రంలోని ఇత‌ర జిల్లాల్లో చాలా వ‌ర‌కు త‌గ్గిపోయాయ‌ని ఫిర్యాదులు అందుతున్నాయి.

పాఠ‌శాల‌ల‌కు, కాలేజీల‌కు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగ‌స్థులు, ఇత‌ర ప్ర‌యాణికులు స‌రిప‌డా బ‌స్సులు లేక ఆటోలు, ప్రైవేటు వాహ‌నాల‌ను ఆశ్రయించి ఇబ్బందులు ప‌డుతున్నారు. ఉన్న కొద్ది పాటి బ‌స్సుల్లో కిక్కిరిసి ప్ర‌యాణం చేస్తున్నారు. న‌గ‌రంలోని చాలా కాల‌నీల‌కు బ‌స్సులను ర‌ద్దు చేయ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.

ప్ర‌తి ఊరికి.. ప్ర‌తీ కాల‌నీకి ర‌ద్దు చేసిన బ‌స్సుల‌ను తిరిగి పున‌రుద్ధ‌రించాల‌ని.. కొత్త బ‌స్సుల‌ను కొనుగోలు చేయాల‌ని.. లాక్‌డౌన్‌, ఆర్టీసీ స‌మ్మెకు మునుపు ఉన్న ప‌రిస్థితి తేవాల‌ని ప్ర‌యాణికులు కోరుకుంటున్నారు. ఇవ‌న్నీ జ‌రిగితేనే స‌జ్జ‌నార్ ఆశ‌యాలు నెర‌వేరుతాయ‌ని.. ఆర్టీసీకి లాభాలు వ‌స్తాయ‌ని.. లేదంటే ఆయ‌న ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని ప‌లువురు ప్ర‌యాణికులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News