బోర్డులకెక్కనున్న జీతాలు... ?

Update: 2022-01-23 23:30 GMT
మొత్తానికి ఏపీలో ఉద్యోగుల ఆందోళన కాదు కానీ వారి జీతాలు ఎంతో ఇపుడు సామాన్యుడికి కూడా తెలిసిపోయింది. అయితే ఇక్కడితో కధ ఆగకుండా ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి జీతమెంత, వారు చేసే పని ఏంటి, ఆ ఆఫీసులో ఎంతమంది పని చేస్తున్నారు, వారు ఎన్ని గంటలు పనిచేయాలి  ఇత్యాది వివరాలన్నీ కూడా ఆయా ఆఫీసులు, స్కూల్స్ ముందు పెద్ద బోర్డులు పెట్టి మరీ డిస్ ప్లే చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.

ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఏపీలో ఉన్న మొత్తం పాఠాశాలలు,  ప్రభుత్వ కార్యాలయాల ముందు ఇప్పటిదాకా ఈ తరహా బోర్డులు అయితే లేవు. అసలు చాలా ఆఫీసుల్లో ప్రజలకు ఏఏ సేవలు అందుతాయి అన్నది కూడా సామాన్య జనాలకు తెలియదు. తమకు ఫలానా పని కావాలీ అంటే ఎక్కడికి వెళ్లాలి అన్న ప్రశ్న ముందు కామన్ మాన్ కి వస్తుంది. తీరా వెళ్ళాక కొన్ని చోట్ల మా పని అది కాదు అని తిప్పి పంపిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

మరో వైపు చూస్తే స్టాఫ్ లేరు తరువాత చూద్దామని జవాబులు వచ్చిన సీన్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఇక మీదట ఇలా ప్రతీ ఆఫీసు ముందు పూర్తి వివరాలు పెడితే ప్రజలకు ఉపయోగంగానే ఉంటుంది అన్నది మేధావుల మాటగా ఉంది. ఇక ఇక్కడితో కూడా ఆగకుండా ఆయన ఉద్యోగి నెల జీతం కూడా ఆ బోర్డులో వివరంగా రాసి పెడతారట. అంటే ఒక అటెండర్ స్థాయి వ్యక్తి నుంచి పెద్ద ఉద్యోగి వరకూ జీతం, విధులు, బాధ్యతలు, సేవలు ఇలా అన్ని వివరాలతో డిస్ ప్లే  బోర్డులు పెడితే కనుక ప్రజలకు ఉపయోగం ఉండడమే కాకుండా, ఉద్యోగులలో జవాబు దారీ తనం కూడా పెరుగుతుంది అన్న ఆలోచనలు ఏవో ఉన్నాయని అంటున్నారు.

మరో వైపు తమ కోసం ప్రభుత్వం నియమించిన ఉద్యోగి అంత జీతం తీసుకుంటూ పని చేయకపోతే అడిగి చేయించుకునే తత్వం కూడా జనాల్లో పెరుగుతుంది అంటున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలలో ఏ ఏ టీచర్లు ఉన్నారు. వారు ఏ సబ్జెక్టులు బోధిస్తారు అని తెలియడం వల్ల తమ పిల్లలను సర్కారీ బడులకు పంపడం కూడా జరుగుతుంది అంటున్నారు. మొత్తానికి చూస్తే లక్షల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు బాధ్యత వహించడంలేదు అన్న విమర్శలు అయితే చాలానే  ఉన్నాయి.

ప్రభుత్వాలు కూడా వారి విషయంలో ఇప్పటిదాకా  పెద్దగా పట్టించుకోవడంలేదు అని కూడా జనాల ఆవేదన ఉంది. మరి ప్రభుత్వ ఆలోచనలు కనుక నిజమై ఆచరణలోకి వస్తే మాత్రం వీటన్నిటికీ జవాబు చెప్పినట్లు అవుతుందేమో. అంతే కాదు ప్రజలు కూడా తమ పన్నులతో జీతాలు పొందుతున్న సర్కారీ సిబ్బంది సేవలను మరింత ఎక్కువగా నాణ్యతగా పొందే వీలుంటుంది అంటున్నారు. చూడాలి మరి ఈ సంస్కరణలు ఎపుడు వస్తాయో ఏంటో.
Tags:    

Similar News