క్రిస్మస్ స్పెషల్: శాంతాక్లాజ్ పొలిటికల్ గిఫ్ట్టులు

Update: 2016-12-25 11:30 GMT
క్రిస్మస్ అంటే శాంతాక్లాజ్ తెచ్చే బహుమతుల కోసం పిల్లలంతా ఎదురుచూస్తుంటారు.  ఈసారి క్రిస్మస్ కు శాంతాక్లాజ్ తాతయ్య మన పొలిటీషియన్లకు కూడా మంచి బహుమతులు తీసుకొచ్చాడట. వారికి రాత్రే ఆయన గుమ్మం ముందు పెట్టి వెళ్లాడట. నేతల మనసెరిగి మరీ ఆ బహుమతులను పట్టుకొచ్చాడట తాతయ్య. ఎవరికి ఏ బహుమతులు తెచ్చాడో చూద్దామా..

ప్రధాని మోడీకి...:

ప్రధాని మోడీకి ప్రజలంటే ఎంతిష్టమో అందమైన వస్ర్తాలంకరణ అన్నా అంతే ఇష్టం. అంతేకాదు... అవి హుందాగా - అందంగా - డాబుగా - దర్పంగా ఉండాలి. అంతేకాదు.. ఎక్కడా తన హెయిర్ స్టైల్ చెక్కు చెదరకూడదు. మీసం - గడ్డంలో ఒక్క వెంట్రుక కూడా అడ్డం తిరక్కూడదు. గ్లామర్ కి అంత ప్రాధాన్యమిస్తారట ఆయన. ఈ సంగతి తెలిసిందో ఏమో కానీ, శాంతాక్లాజ్ మన ప్రధాని కోసం అందమైన నిలువుటద్దం ఒకటి బహుమతిగా ఇచ్చారట. దానికి పన్ను చెల్లించినట్లు రశీదు కూడా తెచ్చారట.

రాహుల్ గాంధీ:

కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి శాంతాక్లాజ్ టైమ్లీ గిఫ్టు ఇచ్చాడట. రూ.2 వేల నోట్లు ఒక పది తెచ్చి ఆయన తలగడ కింద పెట్టి వెళ్లిపోయాడట. పాపం.. రాహుల్ రూ.2  వేల కోసం ఏటీఎం వద్ద లైన్లో నిలబడడం చూడలేక శాంతాక్లాజ్ ఈ సాయం చేశాడు.  దాంతో పాటు ఒక మైక్ కూడా ఇచ్చాడట.. పార్లమెంటులో మాట్లాడడానికి తనకు మైక్ ఇవ్వడం లేదని, ఆయన పదేపదే అడుగుతుండడంతో శాంతాక్లాజ్ జాలిపడి ఆయనకు సొంతంగా ఒక మైక్ ఇచ్చాడు.

అరవింద్ కేజ్రీవాల్:

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు పాపం నిత్యం దగ్గు - జలుబు. కర్ణాటక వచ్చి చికిత్స తీసుకుంటున్నా పెద్దగా ఫలితం రాలేదట. ఈ సంగతి తెలిసిన శాంతాక్లాజ్ ఆయన కోసం బ్రహ్మాండమైన  దగ్గు మందు తెచ్చారట. అది కూడా వచ్చే ఏడాది క్రిస్మస్ వరకు సరిపోయేలా 5 లీటర్ల టిన్ పట్టుకొచ్చారట.  అయితే... తన గిఫ్టు చాలా చిన్నదని.. తన కంటే కేజ్రీవాల్ శత్రువు నజీబ్ జంగ్ ఇచ్చిందే ఆయనకు గొప్ప గిఫ్టని శాంతాక్లాజ్ కేజ్రీకి చెప్పాడట. ఎందుకంటే పక్కలో బల్లెంలా ఇంతకాలం నానా తిప్పలు పెట్టిన జంగ్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు పదవికి రాజీనామా చేయడంతో కేజ్రీవాల్ కు పెద్ద గిఫ్టిచ్చినట్లయింది.

కేసీఆర్ కు..:

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా శాంతాక్లాజ్ ఈసారి మంచి గిఫ్టే పట్టుకొచ్చాడు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద వాస్తు పండితుల ఫోన్ నంబర్లన్నీ ఒక పుస్తకంలో రాసి దాన్ని బహుమతిగా ఇచ్చాడట.

చంద్రబాబుకు..:

ఏపీ సీఎం చంద్రబాబుకు శాంతాక్లాజ్ తెచ్చిచ్చిన బహుమతి వింటే ఆశ్చర్యపోవాల్సిందే. హైటెక్ బాబుకు ఎంతో నచ్చేలా ఆయన బ్రహ్మాండమైన గాడ్జెట్ తీసుకొచ్చారట. ఆ గాడ్జెట్ వాడితే.. చంద్రబాబు ఎక్కడ నుంచి మాట్లాడినా అది అన్ని తెలుగు చానల్సుకు ఉన్నది ఉన్నట్లుగా లైవ్ ఇచ్చేస్తుందట. అంతేకాదు.. అప్పటికి ఆ ఛానల్ లో ఏ ప్రోగ్రాం వస్తున్నా కూడా ఆగిపోయి చంద్రబాబు స్పీచే టెలికాస్టు అవుతుందట. అంతేనా... చంద్రబాబు స్పీచంతా టెక్స్టుగా  కన్వర్టయి పత్రికల పేజీలన్నీ నిండిపోయేంత మ్యాటర్ రెడీ చేసి పంపిస్తుందట.
    
ఇలా నేతలందరికీ వారికి ఎంతో ఇష్టమైన, ఎంతగానో కోరుకుంటున్న గిఫ్టులిచ్చాడు శాంతాక్లాజ్ తాతయ్య.

-- గరుడ

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News