దేవుడి పూజ‌కు 'కేసీఆర్' చెట్టు పూలు

Update: 2017-10-05 05:53 GMT
ప్ర‌చారం పరాకాష్ఠ‌కు చేరిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఏ చిన్న అవ‌కాశం ల‌భించినా.. త‌మ‌కున్న అభిమానాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ.. ప‌త్రిక‌ల్లో వ‌స్తున్న వార్త‌లు చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. ప్ర‌తి విష‌యంలోనూ తాము మ‌ద్ద‌తు ఇచ్చే అధినేత‌ల ఇమేజ్ ను అంత‌కంత‌కూ పెంచేలా వార్త‌ల్ని వండేస్తున్న వైనం చూస్తే షాక్ తినాల్సిందే.

తాజాగా ఒక ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌లో విశేష ప్రాధాన్య‌త ఇస్తూ ఇచ్చిన వార్త‌లో పేర్కొన్న అంశం ఏమిటో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.  తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను  భ‌జ‌న చేసేలా ఉన్న ఈ ఉదంతం చూస్తే  ఏమ‌నాలో అర్థం కాని ప‌రిస్థితి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంతో ఇష్టంగా అమ‌లు చేస్తున్న హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్క‌లు నాటుతున్న సంగ‌తి తెలిసిందే.

రెండేళ్ల క్రితం స్టార్ట్ చేసిన ఈ కార్య‌క్ర‌మ ఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసా? అంటూ చెప్పేందుకు ప్రస్తావించిన ఉదాహ‌ర‌ణ చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. సీఎం పేషీ ప్ర‌త్యేకంగా విడుద‌ల చేసిన ప్రెస్ నోట్ ను ఆధారంగా చేసుకొని ఈ వార్త‌ను రాసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇంత‌కీ.. స‌ద‌రు వార్త సారాంశం ఏమిటంటే.. 2015 జులై 3న రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆల‌యం ద‌గ్గ‌ర హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా తొలి మొక్క‌గా సంపెంగ మొక్క‌ను నాటారు.

సీఎం స్వ‌యంగా త‌న స్వ‌హ‌స్తాల‌తో నాటిన మొక్క కావ‌టంతో దానికి స్పెషల్ కేర్ తీసుకోవ‌టంతో రెండేళ్ల‌లో అదో పెద్ద చెట్టుగా మారింది. సువాస‌న‌లు వెద‌జ‌ల్లుతూ.. నిత్యం పువ్వుల్ని ఇస్తుంద‌ట‌. ఈ పువ్వుల్ని భ‌ద్రంగా చేస్తూ అక్క‌డి ఆల‌య అధికారులు స్వామివారికి పూజ‌లు చేస్తున్నార‌ట‌.

బాలాజీ ఆల‌యంలో స‌తీమ‌ణితో క‌లిసి సీఎం కేసీఆర్ నాటిన సంపెంగ మొక్క ఇప్పుడు పెద్ద చెట్టుగా కావ‌ట‌మే కాదు.. సీఎంతో పాటు నాడు మంత్రులు నాటి మొక్క‌ల‌న్నీ చెట్లుగా మారాయ‌ని.. దీంతో ఆల‌య ప్రాంగ‌ణ‌మంతా ఉద్యాన‌వ‌నాన్ని త‌ల‌పిస్తోంద‌ని రాసిన రాత‌లు చూస్తే.. అభిమానం ఉంటే వార్త‌లు ఇలా ఉంటాయి మ‌రి అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. చూస్తుంటే.. కేసీఆర్ హ‌రిత‌హారం మొద‌లు పెట్టిన త‌ర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం ప‌చ్చ‌ద‌నంతో విర‌బూస్తుంద‌ని.. ఇంత‌కాలం అలాంటిదేమీ లేద‌న్న వార్త‌లు రానున్న రోజుల్లో వ‌స్తాయేమో? అంతేకానీ.. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం కింద ఖ‌ర్చు చేసిన వంద‌ల కోట్ల ప్ర‌జాధ‌నం స‌ద్వినియోగం అయ్యిందా?  దుర్వినియోగం అయ్యిందా? అన్న లెక్క‌లు తేల్చటం ప్ర‌ముఖ మీడియాలు ఎందుకు మ‌ర్చిపోతున్న‌ట్లు?
Tags:    

Similar News