గడిచిన తొమ్మిది రోజులుగా ప్రముఖంగా కనిపించని పాత ముఖం ఒకటి తెర మీదకు వచ్చేశారు. అమ్మ బతికి ఉన్నప్పుడు పోయెస్ గార్డెన్ పరిసరాల్లోకి వచ్చేందుకు కూడా వణికిపోయిన చిన్నమ్మ భర్త.. మన్నార్ గుడి మాఫియాకు కీలకమన్న ఆరోపణలున్న నటరాజన్ సీన్లోకి వచ్చేశారు. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా కోర్టులో లొంగిపోయేందుకు బెంగళూరుకు చిన్నమ్మ బయలుదేరిన వేళ.. తమిళనాడు రాజకీయాల్ని దగ్గరుండి చక్కదిద్దేందుకు వీలుగా ఆమె భర్త నటరాజన్ తెర మీదకు వచ్చారు.
మొన్నటి వరకూ తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లుగా వార్తలు వచ్చి.. ఎక్కడా కనిపించని నటరాజన్.. తాజాగా మాత్రం మరింత ఉత్సాహంగా కనిపించటమేకాదు.. జైలుశిక్షకు గురైన శశికళతో తామంతా టచ్ లో ఉన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యతో.. తమిళనాడు రాజకీయ పరిణామాల్లో తన జోక్యం ఉండనున్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారని చెప్పాలి. 2011లో జయలలిత ఆగ్రహానికి గురై.. పోయెస్ గార్డెన్ వైపు రావటానికి సైతం వణికిన నటరాజన్ ఇప్పుడు ఏకంగా రాజకీయ చక్రం తిప్పేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించటం గమనార్హం. గతంలో ఎవరినైతే పార్టీకి.. పోయెస్ గార్డెన్ కు అమ్మ దూరంగా ఉంచారో వారంతా ఒక్కొక్కరిగా పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్న వైనం చూస్తే.. శశికళ కుటుంబం యావత్తు.. అన్నాడీఎంకే పార్టీ మీద పట్టు కోసం పథక రచన చేసినట్లుగా కనిపిస్తోంది. తాజా పరిణామాలపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/