అమ్మ మృతిపై సుప్రీంలో ఎంపీ పిటిష‌న్‌

Update: 2016-12-19 08:20 GMT
అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్పరాజ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతికి దారితీసిన పరిణామాలపై ఆనేక అనుమానాలు కలుగుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు జయ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని లేదా సుప్రీం కోర్టు న్యాయమూర్తి సారధ్యంలో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని  శశికళ పుష్పరాజ్ కోరారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

త‌మ నాయ‌కురాలు అయిన జ‌య‌లలిత వారాల తరబడి ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ఆమె వాస్తవ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పుడూ ఎవరికీ తెలియలేదని, ఆమెను చూసేందుకు ఎవరినీ అనుమతించలేదని కూడా శశికళ పుష్ప తన పిటిషన్‌ లో పేర్కొన్నారు. పైగా, జయ మరణించిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఫొటోలు అనేక అనుమానాలు రేకెత్తించాయని, ఆమె ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి చివరి వరకూ అంతా గోప్యంగానే ఉంచారని శశికళ పుష్పరాజ్ తెలిపారు. జయ ఆరోగ్య పరిస్థితి- చేసిన చికిత్స గురించి అన్ని వివరాలను సీల్డు కవర్‌లో వెల్లడించాలని కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం, అపోలో ఆసుపత్రిని ఆదేశించాలని సుప్రీం కోర్టును  శశికళ పుష్పరాజ్  కోరారు. ఈ నివేదికలను వైద్య నిపుణులు పరిశీలించాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉండ‌గా..అమ్మ మ‌ర‌ణంపై సందేహం వ్య‌క్తం చేసిన వారిలో  శశికళ పుష్పరాజ్ మూడో మ‌హిళ‌. సినీ న‌టి గౌత‌మి ముందుగా ఈ సందేహం వ్య‌క్తం చేస్తూ ప్ర‌ధాన‌మంత్రికి ట్విట్ట‌ర్ లో లేఖ రాశారు. విప్ల‌వ నాయ‌కి మ‌ర‌ణంపై అనేక సందేహాలు ఉన్నాయ‌ని ఆమె పేర్కొన్నారు. అనంత‌రం జ‌య మేన‌కోడ‌లు దీపా సైతం ఇదే రీతిలో మీడియాతో వ్యాఖ్యానించారు. జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై త‌మ‌కు సందేహాలు ఉన్నాయ‌ని, ఆమె స‌హ‌చ‌రురాలు శ‌శిక‌ళ తీరు అనుమాన‌స్పదంగా ఉంద‌ని పేర్కొన్నారు.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News