ఆసుప‌త్రిలో అమ్మ సీరియ‌ల్ చూశారట‌

Update: 2018-03-22 04:51 GMT
ఎవ‌రెన్ని చెప్పినా అమ్మ జ‌య‌ల‌లిత అనారోగ్యం.. ఆమె మ‌ర‌ణంపై సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు బోలెడ‌న్ని సందేహాలున్నాయి. ఆమెది స‌హ‌జ మ‌ర‌ణం అంటే వెంట‌నే న‌మ్మేసే ప‌రిస్థితుల్లో త‌మిళ ప్ర‌జ‌లు లేర‌ని చెబుతారు. ఆమె మ‌ర‌ణం వెనుక ఏదో కుట్ర ఉంద‌న్న అభిప్రాయాన్ని ప్ర‌తి ఇద్ద‌రు త‌మిళుల్లో ఒక‌రు చెబుతుంటారు.  అమ్మ మ‌ర‌ణంపై త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన అరుముగ‌సామి క‌మిష‌న్ కు చిన్న‌మ్మ శ‌శిక‌ళ త‌ర‌ఫు లాయ‌ర్లు ఒక అఫిడ‌విట్‌ను దాఖ‌లు చేశారు.

ఇందులో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల్ని పొందుప‌ర్చారు. అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన అమ్మ‌ను తాను చూడ‌లేద‌ని.. త‌న‌ను ఆమె ద‌గ్గ‌ర‌కు అనుమ‌తించ‌లేద‌ని అమ్మ‌కు వీర విధేయుడు ప‌న్నీర్ సెల్వం చెప్ప‌టం తెలిసిందే. అయితే.. ఆసుప‌త్రిలో అమ్మ‌ను ప‌రామ‌ర్శించిన వారి జాబితాలో ప‌న్నీర్ సెల్వం పేరును శ‌శిక‌ళ పేర్కొన‌టం గ‌మనార్హం.

అమ్మ ఆరోగ్యం దెబ్బ తిన‌టానికి కార‌ణాన్ని వివ‌రించిన చిన్న‌మ్మ‌.. అక్ర‌మాస్తుల కేసులో జైలుకు వెళ్లి.. బెయిల్ మీద బ‌య‌ట‌కు రావ‌టంపై ఆమె తీవ్ర‌మైన మ‌నోవ్య‌ధ‌కు గుర‌య్యార‌న్నారు. జైలు నుంచి తిరిగి వ‌చ్చిన నాటి నుంచి ఆమె ఆరోగ్యం దెబ్బ తింద‌న్నారు.

2016 సెప్టెంబ‌రు 22న రాత్రి బాత్రూంలో ప‌డిపోవ‌టంతో డాక్ట‌ర్ శివ‌కుమార్‌ను తాను పిలిపించిన‌ట్లుగా శ‌శిక‌ళ పేర్కొన్నారు. అపోలో ఆసుప‌త్రికి తీసుకెళ్లే స‌మ‌యంలోనే అమ్మ‌కు స్పృహ‌లోకి వ‌చ్చార‌ని.. ఆసుప‌త్రికి తీసుకెళుతున్నందుకు త‌న‌ను కోప్ప‌డ్డార‌ని చిన్న‌మ్మ వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా అమ్మ‌ను ఆసుప‌త్రిలో వైద్యం చేసిన డాక్ట‌ర్లు మొద‌లు.. డిసెంబ‌రు 5 వ‌ర‌కు అమ్మ‌ను ఎవ‌రెవ‌రు ప‌రామ‌ర్శించారో వారి జాబితాను వెల్ల‌డించారు.

ఇందులో ప‌న్నీర్ సెల్వంతో పాటు.. గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు.. భ‌ద్ర‌త అధికారులు వీర పెరుమాళ్ స్వామి.. పెరుమాళ్ స్వామి.. ఆరోగ్య మంత్రి విజ‌య్ భాస్క‌ర్.. కార్మిక మంత్రి నిలోఫ‌ర్ క‌బిల్.. పార్ల‌మెంటు డిప్యూటీ స్పీక‌ర్ తంబిదురై త‌దిత‌రులు ఉన్న‌ట్లుగా చెప్పారు.

అమ్మ‌కు సంబంధించిన వివ‌రాల్ని పేర్కొన్న చిన్న‌మ్మ‌.. మ‌రో ఆస‌క్తిక‌ర అంశాన్ని చెప్పుకొచ్చారు. డిసెంబ‌రు నాలుగో తేదీన జై హ‌నుమాన్ సీరియ‌ల్ ను చూసిన కాసేప‌టికి అమ్మ‌కు వ‌ణుకు వ‌చ్చింద‌న్నారు. ఆ త‌ర్వాతి రోజే ఆమె మ‌ర‌ణించార‌న్నారు. శ‌శిక‌ళ మాట‌లు చూస్తే.. ఆసుప‌త్రిలో అమ్మ కోలుకోవ‌ట‌మే కాదు.. ఆమె సీరియ‌ల్స్ చూసే వార‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు. ఆసుప‌త్రిలో ఇంత‌మంది ప‌రామ‌ర్శించిన‌ట్లు చిన్న‌మ్మ చెబుతున్నా.. వీరిలో ఏ ఒక్క‌రూ తాము అమ్మ‌ను ఆసుప‌త్రిలో చూశామ‌ని చెప్ప‌క‌పోవ‌టం ఏమిటి? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.
Tags:    

Similar News