పెరోల్‌ పై వ‌చ్చి షాక్ ఇచ్చే ప‌నులు చేసిన శ‌శిక‌ళ‌

Update: 2017-11-17 13:47 GMT
త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత నెచ్చెలి - అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ లీల‌లు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత రాజ‌కీయంగా అనూహ్య‌మైన రీతిలో చ‌క్రం తిప్పిన శ‌శిక‌ళ ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న ప‌న్నీర్ సెల్వంకు షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి పీఠంపై క‌న్నేసిన చిన్న‌మ్మ అక్ర‌మాస్తుల రీత్యా ఆ క‌ల‌ను నెర‌వేర్చుకోలేక‌పోయారు. అయితే ఆస్తుల సంపాద‌న విష‌యంలో చిన్న‌మ్మ స‌హా ఆమె కుటుంబీకులు - బంధువుల ఆర్థిక వ్య‌వ‌హారాలు అవాక్క‌య్యే రీతిలో ఉన్నాయని తేలింది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా....వెయ్యికోట్ల రూపాయలకు పైగా పన్ను ఎగవేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. అయితే తాజాగా మ‌రో క‌ల‌క‌లం చోటుచేసుకునే వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది.

పెరోల్‌ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన శ‌శిక‌ళ ఈ స‌మ‌యంలో త‌న ఆర్థిక వ్య‌వ‌హారాలు చ‌క్క‌దిద్దుకున్నార‌ని తెలుస్తోంది. దాదాపు 622 ఆస్తుల‌ను ఆమె బ‌ద‌లాయించార‌ని ఐటీ అధికారులు గుర్తించారు. చిన్న‌మ్మ ఆస్తుల‌పై వ‌రుస‌గా ఐదు రోజులు దాడులు జ‌రిపిన ఐటీ అధికారులు షాక్ తినే అంశాల‌ను గుర్తించార‌ని సమాచారం. పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో త‌న పేరుతో ఉన్న ఆస్తుల‌ను ఇత‌రుల‌కు మార్పిడి చేసిన‌ట్లు తేలింది. అయితే పెరోల్‌ పై ఉన్న‌ప్ప‌టికీ...ఆమె క‌ద‌లిక‌ల‌పై ఓ క‌న్నేసిన ఐటీ శాఖ అధికారులు...కూపీలాగి ఐటీ దాడులు చేశారు. దీంతో చిన్న‌మ్మ అక్ర‌మాస్తుల బాగోతం వెలుగులోకి వ‌చ్చింది. ముప్పై వేల అక్ర‌మాస్తులు గుర్తించిన ఐటీ అధికారులు రూ.1400 కోట్ల వ‌ర‌కు ప‌న్ను క‌ట్ట‌లేద‌ని తేల్చారు.

కాగా, తమిళనాడులోని శశికళ వ్యాపార సామ్రాజ్యానికి ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. జయ టీవీ - డాక్టర్ నమధు ఎంజీఆర్ దినపత్రిక సహా అన్నాడీఎంకేలోని శశికళ వర్గానికి చెందిన అసమ్మతి నేతల నివాసాల్లో అధికారులు మూకుమ్మడి సోదాలు చేపట్టారు. పన్నులు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు రావడం వల్లే సోదాలు జరుపుతున్నట్టు ఐటీ అధికారులు పేర్కొన్నారు. జయ ప్లస్‌ చానెల్ జాబితాలోని దాదాపు 16 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. వీటితో పాటు శశికళ కుటుంబం చేతుల్లో ఉన్న మన్నార్‌ గుడి - తంజావూర్‌ లలోని పలువురి నివాసాలలో అధికారులు అకస్మిక సోదాలు నిర్వహించారు. టీటీవీ దినకరన్ - దివాకరన్ - సుందరవదనం తదితరులతో పాటు శశికళ కుటుంబంలోని సన్నిహితులందరి ఇళ్లలో ఐటీ దాడులు జరిగాయి. బెంగళూరులోని అన్నాడీఎంకే కర్నాటక రాష్ట్ర కార్యదర్శి ఇంటిని కూడా వదల్లేదు. అయితే, జయ టీవీ కార్యాలయంపై ఆదాయ శాఖ అధికారుల దాడులను ఖండించారు టీటీవీ దినకరన్. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. దాడులతో తమను భయపెట్టాలని కేంద్రం పగటి కలలు కంటున్నదన్నారు.
Tags:    

Similar News