వైసీపీలోకి సతీష్ రెడ్డి కారణం చంద్రబాబే ..అసలు విషయమేంటంటే ?

Update: 2020-03-09 12:00 GMT
కడప జిల్లాలో ..2019 ఎన్నికల్లో టీడీపీ కి ఒక్క సీటు కూడా రాలేదు కదా ..కనీసం ఎక్కడా కూడా టీడీపీ గట్టి పోటీ కూడా ఇవ్వలేదు. దీనితో ఇప్పటికే కడప లో టీడీపీ భూస్థాపితం అయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తాజాగా కడప జిల్లా లో టీడీపీకి భారీ షాక్ తగలబోతుంది. దీనితో ఇక కడపలో టీడీపీ ఖాళీ కావడం ఖాయం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన సీనియర్ నేతలు ఆ పార్టీని వీడనున్నారు. మాజీ మంత్రి టీడీపీ నేత రామసుబ్బారెడ్డి, పులివెందుల టీడీపీ ఇంచార్జ్ సతీష్ రెడ్డి ఆ పార్టీని వీడి, అధికార పార్టీ అయిన వైసీపీ లో చేరబోతున్నారు.

ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక పెద్ద దిక్కు సతీష్ రెడ్డి. పార్టీ నుంచి పెద్దగా మద్దతు లేకపోయినా కూడా , అయన గత కొన్నేళ్లుగా వై ఎస్ ఫ్యామిలీ తో పోటీ పడుతూనే ఉన్నాడు. పులివెందులలో వై ఎస్ కుటుంబానికి ఎదురునిలిచి , ఎన్నికల్లో పోటీ చేసే ఏకైక టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డి. నియోజకవర్గం లో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న సతీష్ రెడ్డి.. ప్రస్తుతం ఆలోచన లో పడ్డట్టు తెలుస్తుంది.

సతీష్ రెడ్డి ..పార్టీ మార్పు గురించి ఆలోచన లో పడటానికి ఒక రకంగా టీడీపీ అధినేత చంద్రబాబే కారణం.అదేలా అని అనుకుంటున్నారా ...పులివెందుల రౌడీలు, కడప గూండాలు.. ఈ మధ్య కాలంలో టీడీపీ నేతలు ఎవరు నోరు తెరచినా మొదటగా వినిపించే పదాలు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా దానికి కారణం కడప గుండాలె అని చెప్పడం టీడీపీకి లోకం అలవాటుగా మారిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు , తనయుడు లోకేష్ బాబు కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ మాటలకి టీడీపీ తగిన మూల్యం చెల్లించుకునే సమయం ఆసన్నం అయ్యింది అని పులివెందుల టీడీపీ నేతలు చెప్తున్నారు.

మొన్న విశాఖపట్నం విమానాశ్రయం వద్ద చంద్రబాబుపై చోటు చేసుకున్న దాడి కూడా పులివెందుల గూండాలు, రౌడీల పనేనంటూ ఆరోపణలు గుప్పించారు. ఇలాంటి వ్యాఖ్యల పట్ల పులివెందులకు చెందిన టీడీపీ నాయకులు స్థానికుల నుండి కొన్ని ఇబ్బందులని ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో సతీష్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారని తెలుస్తుంది. అలాగే ఈ తరహా వ్యాఖ్యలు టీడీపీ నేతలు చేస్తూనే ఉండటం తో , ఇక పార్టీలో కొనసాగలేము అన్న స్థితికి వచ్చినట్టు సమాచారం.

ఇదే సమయంలో జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డి అధికార పార్టీలో చేరడానికి సన్నాహాలు పూర్తి చేయడం తో..ఆయనతో పాటుగా సతీష్ రెడ్డి కూడా వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. మొత్తంగా రేపో, మాపో సీఎం సమక్షంలో ఇద్దరు కీలక నేతలు వైసీపీలో చేరడం ఖాయం అంటూ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే కనుక జరిగితే ..టీడీపీకి కడప జిల్లాలో అభ్యర్థులు దొరకడం కూడా కష్టమే.
Tags:    

Similar News