తెలుగోడు ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి ఎదిగాడు

Update: 2019-11-21 06:32 GMT
ఒక సామాన్యుడు అత్యుత్తమ స్థానానికి ఎదగటం.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే శిఖరాగ్రానికి చేరుకొని సత్తా చాటటం అంత తేలికైన విషయం కాదు. దీన్ని తన చేతలతో చేసి చూపిస్తున్నారు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల. అత్యుత్తమ లక్ష్యాల్ని సాధించటం.. అసాధ్యమైన సవాళ్లను ఎదుర్కొని.. వినూత్న పరిష్కారాల్ని కనుగొన్న 20 మంది అత్యుత్తమ వ్యాపారవేత్తలను ఎంపిక చేసిన జాబితాలో సత్యనాదెళ్ల నెంబర్ వన్ స్థానంలో నిలవటం విశేషం.

ఎలాంటి బ్యాంగ్ లేని వేళ.. సత్యనాదెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఎంపిక చేసిన వేళ.. అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అంత పెద్ద స్థానాన్ని సత్యనాదెళ్ల ఎలా డీల్ చేస్తారన్న సందేహం ఉండేది. దాన్ని పటాపంచలు చేస్తూ.. తన సత్తాను చాటారు.

తాజాగా 10 బిలియన్ డాటర్ల పెంటగాన్ క్లౌడ్ కాంట్రాక్టును అందుకోవటంలో నాదెళ్ల చూపించిన చొరవ కంపెనీని మరో స్థాయికి తీసుకెళ్లేలా చేసిందన్న మాట కంపెనీ స్వతంత్ర డైరెక్టర్లు చెప్పటం విశేషం. తాజాగా వెల్లడైన ఫార్చూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2019 జాబితాలోనే కాదు.. కొద్ది రోజుల క్రితం హార్వర్డ్ బిజినెస్ రివ్యూ రూపొందించిన అగ్రశ్రేణి కంపెనీల సీఈవోల జాబితాలోనూ సత్య నాదెళ్ల ఉండటం గమనార్హం.

తాను సాధించిన ఘనతను తనకు మాత్రమే పరిమితం చేసుకోకుండా.. అందరికి పంచటం.. విజయంలో అందరిని భాగస్వామ్యం చేయటం సత్యనాదెళ్లలో ఉన్న మరో గొప్పతనంగా చెప్పాలి. తన మీద తనకు నమ్మకం ఎక్కువని.. అదే సమయంలో మిగిలిన వారిని తాను ఎదగనిస్తానని సత్య చెబుతారు. సీఈవోలకు అద్భుతమైన టీం లేకుంటే ఏమీ చేయలేరని.. లక్కీగా తనకు ఆ టీం లభించిందని చెప్పటం ద్వారా.. సక్సెస్ మొత్తం తన ఖాతాలో వేసుకోకుండా అందరికి పంచటం సత్య గొప్పతనంగా చెబుతారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తాజా ఫార్చూన్ జాబితాలో సత్యనాదెళ్లతో పాటు భారతీయ సంతతికి చెందిన మరో ఇద్దరు కూడా నిలిచారు. వారిలో ఒకరు మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా అయితే.. ఇంకొకరు కాలిఫోర్నియా కంప్యూటర్ నెట్ వర్కింగ్ సంస్థ అరిస్టా హెడ్ జయశ్రీ ఉల్లాల్ కావటం విశేషం. అజయ్ బంగా ఎనిమిదో స్థానంలో నిలిస్తే.. 18వ స్థానంలో జయశ్రీ ఉల్లాల్ నిలిచారు.
Tags:    

Similar News