ఏంది బాబు.. వర్షం పడితే అమరావతిలో ఏమీ కాదా?

Update: 2019-10-23 08:29 GMT
తిరిగే కాలు.. తిట్టే నోరు ఊరికే ఉండవన్న సామెతను గుర్తు చేస్తుంటారు టీడీపీ అధినేత చంద్రబాబు. దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యేలా భారీ ఓటమి మీద పడినా.. ఆయన అలాంటిదేమీ పట్టనట్లు.. మరింత శ్రమ పడితే మరింత బాగా ఫలితాలు వస్తాయంటూ తనకు మాత్రమే అర్థమయ్యే లాజిక్కులు చెబుతూ ఏపీ వ్యాప్తంగా అటూ ఇటూ తిరుగుతున్నారు. మైకు చేతికి అందిన వెంటనే.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాలుగు నెలలు కూడా పూర్తి కాని జగన్ పై విరుచుకుపడుతున్నారు.

ఒకరి సాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. వారిని ఉద్దేశించి మరో అధినేత మాట్లాడితే ప్రజల్లో స్పందన ఉంటుంది. అందుకు భిన్నంగా.. తిట్టటం.. ప్రతి విషయాన్ని తప్పు పట్టటమే ఎజెండా గా పెట్టుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇప్పుడు బాబు పరిస్థితి ఇలానే ఉంది.

తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు. ఇటీవల కాలంలో దీనికి మించిన జోక్ మరొకటి లేదనే చెప్పాలి. తాను రాజధానిగా డిసైడ్ చేసిన అమరావతి గ్రీన్ సిటీగా అభివర్ణిస్తున్న ఆయన.. హైదరాబాద్ లో వర్షం పడితే డ్రైన్లు పొంగుతాయని.. అదే అమరావతిలో ఏ సమస్యా తలెత్తదని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. నిజమే.. హైదరాబాద్ లో డ్రెయిన్లు ఉన్నాయి కాబట్టి పొంగుతాయి. అమరావతిలో అలాంటివేమీ ఉండవు కాబట్టి.. పొంగటం అనే సమస్యే ఉండదని జోకులు వేస్తున్నారు.

అమరావతి గొప్పలు చెప్పాలంటే.. దానికి సంబంధించిన అంతో ఇంతో మంచి ఉదాహరణ చెప్పాలి కానీ.. చూస్తూ చూస్తే వర్షం గురించి చెప్పినంతనే.. వందలాది కోట్లు ఖర్చు చేసి నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో వానొస్తే.. మంత్రుల ఛాంబర్లలోకి వర్షపు నీరు ఏ స్థాయిలో వచ్చేది.. ప్రతి గదిలోనూ నీళ్లు కారటం.. లాంటివి తెలిసిందే.  వర్షం వస్తే చాలు అమరావతి ఆగమాగం కావటమే కాదు.. కాలు తీసి కాలు వేయాలంటే కూడా కష్టమనే వాస్తవాన్ని.. అందుకు భిన్నంగా బాబు గొప్పలు చెబితే.. ఎవరు మాత్రం ఊరికే ఉంటారు. గొప్పలు చెప్పొచ్చు. అందులో వాస్తవం అంతో ఇంతో ఉంటే ఫర్లేదు. అందుకు భిన్నంగా ఇలా డబ్బా కొట్టే తీరును తప్పు పట్టమే కాదు.. బాబు మీద మరింత విరుచుకుపడటంలో తప్పేం కనిపించదని చెప్పక తప్పదు.


Tags:    

Similar News