య‌డ్డీ ప‌ర్వంపై స్పందించి న‌వ్వుల పాల‌యిన బాబు

Update: 2018-05-19 16:27 GMT

ఏ విష‌యంపై ఎప్పుడు, ఎలా ప్ర‌చారం చేసుకోవాలో...టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుకు తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలియ‌ద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చాలామంది చెప్పేమాట‌. అయితే అలా స్పందించిన బాబు తాజాగా నెటిజ‌న్ల చేతుల్లో వివిధ రాజ‌కీయ పార్టీల ద్వారా విమ‌ర్వ‌ల‌ను ఎదుర్కుంటున్నారు. సెటైర్ల‌ను భ‌రిస్తున్నారు. త‌నంత తానుగా బాబు ఇలా అడ్డంగా బుక్ అయింది ఏ విష‌యంలో అంటే...క‌ర్ణాట‌క సీఎం స్థానానికి య‌డ్యుర‌ప్ప రాజీనామా చేయ‌డం గురించి. ఈ ప‌రిణామంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ యడ్యూరప్ప రాజీనామా ప్రజాస్వామ్య విజయమని వ్యాఖ్యానించారు.

యడ్యూరప్ప రాజీనామాతో ప్రజస్వామ్యవాదులంతా ఆనందంగా ఉంటారని చంద్రబాబు తెలిపారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా బర్తరఫ్ చేశారని సీఎం గుర్తు చేశారు. 30 రోజులు పోరాడి ఎన్టీఆర్‌ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకున్నామని తెలిపారు. ప్రధాని మోదీ - అమిత్‌ షా కలిసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. కర్ణాటక గవర్నర్ మెజారిటీ ఉన్న కాంగ్రెస్ - జేడీఎస్‌ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా పిలవకుండా.. సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారం ఉందని బీజేపీ ఒక్కో చోట ఒక్కో సంప్రదాయాన్ని అవలంభిస్తున్నదన్నారు. ఇదే సారాంశంతో చంద్ర‌బాబు ట్వీట్ కూడా చేశారు.

అయితే ఈ ట్వీట్‌ పై నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల‌ను పార్టీ ఫిరాయింప‌చేసి - అనంత‌రం వారిని మంత్రివ‌ర్గంలోకి తీసుకున్న ఉదంతాన్ని గుర్తుకుచేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ``యడ్యూరప్ప రాజీనామా ప్రజాస్వామ్య విజయమే - ఆనందంలో దేశం ఉంది కానీ ఆ దేశంలో మేము అనగా ఆంధ్రులం లేమని బాధపడుతున్నాం @ncbn గారు. మీకు నైతికతలు,విలువలు అంతకు మించి ప్రజాస్వామ్యంపై గౌరవముంటే మీరు దొరికినందుకు ఎమ్మెల్యేల‌ను కొన్నందుకు రాజీనామా చేసిన రోజు ఆ ఆనందంలో మేము కూడా పాలి భాగస్తులవుతాం!!`` అంటూ ఓ నెటిజ‌న్ కౌంట‌ర్ వేశారు. ``మీరు ఏకంగా పార్టీ ఫిరాయింపజేసి మంత్రిపదవులు కట్టబెట్టారు గా...మరి మీరా ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడేది?`` ``ప్రజాస్వామ్యవాదివా?వైసీపీ నుండి ఎమ్మెల్యేల‌ను పార్టీలో తీసుకుని మంత్రి పదవులు ఇచ్చావు ఇది రాజ్యాంగంని అవహేళన చేయడం కాదా?? బాబు గారు ఇలాంటి వాటిమీద స్పందించే ముందు,,మనం చేసిన ఘనకార్యాలు గుర్తుపెట్టుకోండి.ఎన్టీఆర్ గారిని ఎలా గద్దె దింపారో ప్రజలు ఇంకా మర్చిపోలేదు.`` అని త‌మ‌దైన శైలిలో స్పందించారు. ఇక కొంద‌రు త‌మ ప‌రిధుల‌కు మించి కామెంట్లు చేశారు. దీనికి టీడీపీ అభిమానులు ఆయా పార్టీల‌పై ఎదురుదాడి చేయ‌డం కొస‌మెరుపు.
Tags:    

Similar News