మోదీతో భేటీకి స‌త్య నాదెళ్ల రాలేదే!

Update: 2017-06-26 04:44 GMT
భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మూడు దేశాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌స్తుతం అగ్ర‌రాజ్యం అమెరికాలో ప‌ర్య‌టిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత తొలిసారిగా ఆ దేశంలో జ‌రుగుతున్న మోదీ ప‌ర్య‌ట‌న‌ను ఒక్క భార‌త్‌ - అమెరికాలే కాకుండా విశ్వ‌వ్యాప్తంగా అన్ని దేశాలు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నాయి. భార‌త్‌ - అమెరికాల మ‌ధ్య ప‌లు కీల‌క ఒప్పందాల‌కు మార్గం సుగ‌మం కానున్న ఈ ప‌ర్య‌ట‌న‌పై ఇటు భార‌త్ తో పాటు అటు అమెరికా ప్ర‌జ‌లు కూడా ఎప్పుడేం జ‌రుగుతుందా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అమెరికాలో తొలి రోజు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అక్క‌డి టాప్ కంపెనీల సీఈఓల‌తో మోదీ ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. మోదీతో ఈ భేటీలో పాల్గొన్న వారంతా కూడా టాప్ మోస్ట్ కంపెనీ సీఈఓలే.

భార‌త్‌లో అపార‌మైన వ్యాపార అవ‌కాశాలు ఉన్నాయ‌ని, వాటిని స‌ద్వినియోగం చేసుకునే దిశ‌గా యోచించాల‌ని, పెట్టుబ‌డులు పెట్టాల‌ని కోరేందుకే మోదీ వారితో ఈ భేటీ నిర్వ‌హించారు. మోదీతో స‌మావేశం కోసం ఆస‌క్తిగా ఎదురు చూసిన టాప్ కంపెనీల సీఈఓలంతా ఈ భేటీకి వ‌చ్చారు. భేటీకి హాజ‌రైన వారిలో యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ - గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ - జాన్‌ ఛాంబర్స్‌ (సిస్కో) - జెఫ్‌ బెజోస్‌ (అమెజాన్‌) శంతను నారాయణ్‌ (అడోబ్‌) - అజయ్‌ బంగా (మాస్టర్‌ కార్డ్‌) - డేవిడ్‌ ఫర్‌ (ఎమర్సన్‌) - డగ్‌ మెక్‌ మిలన్‌ - పునిత్‌ రంజన్‌ (డెలాయిట్‌ గ్లోబల్‌) - ముఖేష్‌ ఆఘి (అమెరికా-భారత్‌ వాణిజ్య మండలి ప్రెసిడెంట్‌) తదితరులు ఉన్నారు.

అయితే ప్ర‌పంచంలోనే టాప్ కంపెనీగా పేరున్న మైక్రోసాఫ్ట్ సంస్థ‌కు చెందిన ప్ర‌తినిధులు ఏ ఒక్క‌రు కూడా అక్క‌డ క‌నిపించ‌లేదు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా తెలుగు తేజం స‌త్య నాదెళ్ల ఉన్న విష‌యం తెలిసిందే. భార‌త్ లో వ్యాపార విస్త‌ర‌ణ‌కు మైక్రోసాఫ్ట్ కూడా అమితాస‌క్తితో ఉంది. ఆ కంపెనీకి రెడ్ కార్పెట్ ప‌రిచేందుకు భార‌త ప్ర‌భుత్వం కూడా సిద్ధంగానే ఉంది. అయితే మ‌రి ఈ భేటీకి స‌త్య నాదెళ్ల ఎందుకు రాలేద‌న్న విష‌యం తెలియ‌రాలేదు. అస‌లు ఈ భేటీకి హాజ‌రుకావాల‌ని స‌త్య నాదెళ్ల‌కు ఆహ్వానం అందిందా?  లేదా? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. మోదీ నుంచి ఆహ్వానం అందితే... దానిని వేస్ట్ చేసుకునేందుకు ఏ ఒక్క‌రు కూడా సాహ‌సించ‌రు. మ‌రి స‌త్య  నాదెళ్ల‌కు ఆహ్వానం అందిందా?  లేదా? అన్న విష‌యంతో అస‌లు స‌త్య నాదెళ్ల ఈ భేటీకి ఎందుకు హాజ‌రు కాలేద‌న్న విష‌యంపై ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ న‌డుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News