సౌదీ అరేబియా రాజ కుటుంబంలో 'అవినీతి' ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 11మంది యువరాజులతోపాటు - పలువురు మాజీ మంత్రులను - ఓ కోటీశ్వరుడిని సౌదీ అరేబియా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. సౌదీ రాజుగా త్వరలో పట్టాభి షిక్తుడు కానున్న మహ్మద్ బిన్ సల్మాన్ అధికారాన్ని పటిష్ట పరచడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన సారథ్యంలో శనివారం కొత్త అవినీతి నిరోధక కమిషన్ ప్రారంభమైంది. కమిషన్ కొలువుదీరిన కొద్ది గంటల్లోనే ఈ అరెస్ట్ లు జరుగడం గమనార్హం. వారిని అరెస్టు చేసి వారి బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయాల్సిందిగా శనివారం రాత్రి పొద్దుపోయాక సౌదీ రాజు మహ్మద్ బీన్ సల్మాన్ ఆదేశాలు జారీచేశారు. శనివారం రాత్రి వాళ్లందర్నీ అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఉన్నత స్థాయి అవినీతి వ్యతిరేక కమిటీ వారిని దోషులుగా తేల్చిన నేపథ్యంలో జాతీయ భద్రతా దళానికి నేతత్వం వహించే యువరాజుతోపాటు ఆర్థిక మంత్రిని కూడా సౌదీరాజు తొలగించారు. అవినీతికి వ్యతిరేకంగా నూతన కమిటీ ఏర్పాటు చేశారు.
జెడ్డా నగరంలోని పలు ప్రాంతాల్లో 2009లో సంభవించిన వరదలు - కొన్నేండ్లుగా విజంభిస్తున్న 'మెర్స్' వైరస్ కారణంగా వందలాది మంది చనిపోయారు. వీటిపై దర్యాప్తు జరిపే క్రమంలోనే యువరాజులు - మాజీ మంత్రుల వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో రాజు బిన్ సల్మాన్ కఠిన చర్యలకు పూనుకొన్నారని స్థానిక వార్తా సంస్థలు ప్రకటించాయి. అవినీతిపై నూతన కమిటీ కొలువుదీరిన కొద్ది గంటల్లోనే అరెస్టులు జరగడం సౌదీ అరేబియాలో సంచలనం రేపింది. అరెస్టయిన వ్యక్తుల్లో ప్రపంచంలోని అత్యంత ధనికుడిగా పేరొందిన అల్ వాలీద్ బిన్ తలాల్ ఉన్నారు. ప్రపంచంలోనే సంపన్నుడైన యువరాజు అల్-వలీద్ బిన్ తలాల్ కూడా అరెస్టు కావడం అంతర్జాతీయ వ్యాపారవర్గాలను షాక్ కు గురిచేసింది. ఆయనకు ట్విట్టర్ - సిటి బ్యాంక్ వంటి పలు సంస్థల్లో పెట్టుబడులున్నాయి. సౌదీ నేషనల్ గార్డ్ హెడ్ - నేవీ చీఫ్ - ఆర్థిక శాఖ మంత్రులను పదవుల నుంచి తొలగించారు. అవినీతికి వ్యతిరేకంగా ఏర్పాటైన నూతన కమిటీ ఈ పాత కేసులను తిరగదోడిన నేపథ్యంలోనే ఈ అరెస్టులు జరిగాయని సౌదీ ప్రభుత్వ మీడియా సంస్ధ 'అల్ అరేబియా' పేర్కొంది. అత్యుత్తమ స్ధానాల్లో ఉండి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన వ్యక్తులను ప్రభుత్వం వదిలిపెట్టబోదని ఈ సందర్భంగా తెలిపింది.
మరోవైపు మతఛాందస దేశంగా పేరుమోసిన సౌదీలో సింహాసన వారసుడు మహ్మద్ బిన్ సల్మాన్ తెరమీదకు వచ్చినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలు - పలు సంస్కరణలు అరబ్ దేశాలనే కాకుండా ప్రపంచదేశాలను ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఆయన తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని...
- దేశంలో ఆర్థిక - సామాజిక సంస్కరణలను ప్రారంభించడం. అత్యున్నత స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని పునర్ వ్యవస్థీకరించడం - అవసరం లేని వ్యవస్థల్ని కుదించడం.
- ఖతర్ ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా గుర్తించి, దాంతో సంబంధాలను తెంచుకోవడం.
- యెమన్ లోని ఉగ్రవాదుల్ని తుడిచిపెట్టే దిశగా సైనిక చర్యకు ఆదేశం.
- మహిళలు వాహనాలను నడిపేందుకు అనుమతిస్తూ నిర్ణయం..
- స్టేడియంలలోకి వారికి ప్రవేశం కల్పించడం.
- రోహింగ్యా శరణార్థుల సహాయార్ధం 15 మిలియన్ డాలర్లు (రూ97కోట్లు) విరాళంగా ప్రకటన.