అవాక్కయ్యే నిర్ణ‌యాన్ని తీసుకున్న సౌదీ!

Update: 2017-12-11 13:34 GMT
సంప‌ద‌తో తుల‌తూగే సౌదీఅరేబియాలో చ‌ట్టం ఎంత క‌ఠినంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. క‌ఠిన‌మైన చ‌ట్టాల‌తో.. అంత‌కు మించిన ఆంక్ష‌లు అక్క‌డ అమ‌లవుతుంటాయి.  ఇక‌.. మ‌హిళ‌ల‌కు ఉండే సామాజిక క‌ట్టుబాట్లు అన్నిఇన్ని కావు.
 
మ‌హిళ‌లు ఒంట‌రిగా బ‌య‌ట‌కు వెళ్లాలంటే అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి కావ‌టం.. చ‌దువుకోవాల‌న్నా తండ్రి.. సోద‌రుల అనుమ‌తి త‌ప్ప‌నిస‌రిగా ఉండ‌టం లాంటి స‌వాల‌క్ష ఆంక్ష‌లు అమ‌లు చేస్తుంటారు. ఇక‌.. కారు డ్రైవింగ్ లాంటివి అస‌లే ఉండ‌వు. అయితే.. ఈ మ‌ధ్య‌కాలంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. సంస్క‌ర‌ణ‌ల ప‌థంలో ప‌య‌నిస్తున్న సౌదీ ఈ మ‌ధ్య‌న త‌న తీరును మార్చుకుంటూ ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటుంది. అందులో భాగంగా మ‌హిళ‌లు డ్రైవింగ్ చేసేందుకు అనుమ‌తి ఇవ్వ‌టం.. క్రీడా మైదానాల్లో కుటుంబ స‌మేతంగా వెళ్లేందుకు వీలుగా నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఆ ప‌రంప‌ర‌లో తాజాగా సౌదీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది.

వ‌చ్చే ఏడాది నుంచి సినిమా థియేట‌ర్ల‌ను దేశ వ్యాప్తంగా తీసుకురావాల‌ని భావిస్తోంది. నిజానికి 1980ల‌కు ముందు సౌదీలో థియేట‌ర్లు ఉండేవి. అయితే.. 1980ల‌లో ఇస్లామిక్ పున‌రుద్ధ‌ర‌ణ పెద్ద ఎత్తున సాగుతూ భారీ ఉద్య‌మ‌మే జ‌రిగింది. ఈ సంద‌ర్భంలోనే సినిమాలు ప్ర‌ద‌ర్శించ‌టం ఇస్లాం సిద్ధాంతాల‌కు విరుద్ధ‌మంటూ దేశ వ్యాప్తంగా ఉన్న థియేట‌ర్ల‌ను మూసేశారు.

ఇప్పుడా దేశంలో ఒకే ఒక్క థియేట‌ర్ ఉంది. ఖోబార్‌ లోని ఐమాక్స్ థియేట‌ర్ మాత్రం నేటికి న‌డుస్తోంది. అయితే.. ఇక్క‌డ అన్ని సినిమాలు కాకుండా కేవ‌లం సైన్స్‌.. టెక్నాల‌జీల‌కు సంబంధించిన డాక్యుమెంట‌రీలను మాత్ర‌మే ప్ర‌ద‌ర్శిస్తుంటారు. 35 ఏళ్ల త‌ర్వాత సినిమా థియేట‌ర్ల‌ను తిరిగి ప్రారంభించాలని సౌదీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఈ రోజు (సోమ‌వారం) ఆమోదించారు. వ‌చ్చే ఏడాది నుంచి సినిమా థియేట‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌కు లైసెన్స్ లు ఇవ్వ‌నున్నారు. ఇక‌.. తొలి సినిమా థియేట‌ర్‌ ను వ‌చ్చే ఏడాది మార్చిన ప్రారంభమ‌వుతుంద‌ని చెబుతున్నారు. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా నిర్ణ‌యాల్ని ప్ర‌క‌టిస్తున్న సౌదీ స‌ర్కారు విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News