సౌదీ రాజు ఫారిన్ ట్రిప్ ముచ్చట వింటే షాకే

Update: 2017-02-28 09:09 GMT
సంపద షోకు తెలిసిందే. కానీ.. సౌదీ రాజు షోకు గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ప్రపంచ సంపన్న రాచ కుటుంబాల్లో ఒకటిగా చెప్పే సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీ కానీ కాలు బయటకు పెట్టి విదేశాల్లో అడుగు పెట్టారంటే.. ఇక ఆ హడావుడి మామూలుగా ఉండదు. ఆయన విదేశీ పర్యటన షెడ్యూల్ మొదలు.. పూర్తి అయ్యే వరకూ ఆ దేశంలో ఆయన సందడికి అంతుపొంతు ఉండదు. తాజాగా ప్రపంచంలోనే అతి పెద్దదైన ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియా దేశానికి ఆయన తొలిసారి వెళుతున్నారు.

ఈ సందర్భంగా ఆయన కొన్నిరోజులు ఇండోనేషియాలో గడపనున్నారు. ఇదో విశేషం అయితే.. సౌదీ రాజు తాజా ఫారిన్ ట్రిప్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇండోనేషియా పర్యటనకు సౌదీ రాజు తరఫున జరుగుతున్న ఏర్పాట్లు ఇప్పుడు ఆసక్తికర వార్తగా మారింది. ఆయన పర్యటన కోసం వెళుతున్న లగేజ్ బరువు ఎంతో తెలుసా? అక్షరాల 459 మెట్రిక్ టన్నులు (టన్ను అంటే వెయ్యి కిలోలు. ఈ లెక్కన లెక్కేస్తే.. అయ్యగారి లగేజ్ ఎంత భారీ అన్నది ఇట్టే అర్థమవుతుంది).

ఆయన తీసుకెళ్లే భారీ లగేజ్ లో ఏం ఉంటాయన్నది చూస్తే..అవాక్కు అవ్వాల్సిందే. ఆయన లగేజ్ లో రెండు మెర్సిడెజ్ బెంజ్ ఎస్ 600 లీమోసిన్స్ కార్లు.. రెండు కరెంట్ ఎలివేటర్లు కూడా ఉండటం గమనార్హం. రాజుగారి లగేజీని జాగ్రత్తగా ఇండోనేషియాకు తీసుకెళ్లటానికి ఒక కంపెనీకి బాధ్యతలు అప్పజెప్పారట. లగేజ్ తరలింపుకోసం 572 మంది పనివాళ్లు పని చేస్తున్నారట. అంతేనా.. ఇప్పడాయన పర్యటన కోసం ఆయన వెంట దాదాపు 1500 మందిని తోడు తీసుకెళుతున్నట్లుగా చెబుతున్నారు. వీరిలో పది మంది మంత్రులు.. 25 మంది రాకుమారులు.. వంద మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజు ఫారిన్ ట్రిప్ అంటే.. ఆ మాత్రం హడావుడి లేకుండా ఉంటే ఎట్లా అనుకోవాలా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News