సేవ్ అమరావతి .. సేవ్ ఏపీ !

Update: 2020-01-01 06:13 GMT
రాష్ట్రం లో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను నిరసిస్తూ రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన 15 వ రోజు కొనసాగుతూనే వస్తోంది. అమరావతి రైతులు కొత్త సంవత్సరం రోజు వినూత్న నిరసనలతో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. తమకు చావే శరణ్యమని.. మరణించడానికి అనుమతి ఇవ్వాలని కొంత మంది రైతులు రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్‌ కు లేఖ రాశారు.

కొత్త సంవత్సరం రోజుని కూడా అమరావతి మహిళలు తమ నిరసనలకు వాడుకున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమరావతి లో ఇళ్ల ముందు ప్రత్యేక ముగ్గులు వెలిశాయి. పలువురు మహిళలు ముగ్గులు వేసి తమ నిరసన తెలిపారు. ఇళ్ల ముందు రంగవల్లికలు వేసి ‘సేవ్ అమరావతి, సేవ్ ఏపీ’ అంటూ రాశారు. అమరావతి పరిధిలోని ఎర్రబాలెం, నీరుకొండ, పెదపరిమి వంటి పలు గ్రామాల్లో ఇవే తరహా ముగ్గులు కనిపించాయి. రైతు కుటంబాలకు చెందిన మహిళలు బుధవారం తెల్లవారు జాము నుంచే సేవ్ అమరావతి అంటూ ముగ్గులు వేశారు. ప్రభుత్వానికి తమ నిరసనను వినూత్నం గా తెలియజేశారు.

తాము వేసిన రంగవల్లులతో నిరసనను వ్యక్తం చేశారు. రైతు కంట కన్నీరు, తల్లి కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని మహిళలు హితవు పలికారు. అమరావతే మా రాజధాని అని మరికొంత మంది ప్రకటించారు.
నిరసనలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నప్పుడే ఏ వేడుకైనా శోభాయమానంగా ఉంటుందని అన్నారు. అమరావతి ప్రాంత రైతులు మాత్రం ఏ మాత్రం సంతోషంగా లేరని తెలిపారు. వారికి సంఘీభావంగా 2020 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని తెదేపా నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News