పెళ్లి వేడుకలో తెలుగు ముఖ్యమంత్రుల రహస్య భేటీ?

Update: 2021-11-22 04:39 GMT
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయితీలు అన్ని ఇన్ని కావు. సమస్యల పరిష్కారం కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు కలవటం తర్వాత.. కనీసం ఫోన్లో మాట్లాడుకోవటానికి కూడా ఆసక్తి చూపకపోవటం తెలిసిందే. అదే సమయంలో.. జలవివాదం మొదలు ప్రాజెక్టుల వరకు ఉన్న వివాదాల మీద ఎవరికి వారు.. వారికి తోచిన రీతిలో వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయని చెప్పినా.. వారు మాత్రం కలవటానికి.. సమస్యల మీద చర్చలు జరపటానికి మాత్రం ఆసక్తిని చూపించలేదు.

ఇదిలా ఉంటే.. ఆదివారం ఉదయం శంషాబాద్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనమరాలి పెళ్లివేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే సమయంలో రావటం ఆసక్తికరంగా మారింది. అప్పటివరకు స్పీకర్ మనమరాలి పెళ్లికి లేని సరికొత్త ప్రాధాన్యత లభించింది. అందరి చూపు ఇద్దరు ముఖ్యమంత్రులపై పడటం తెలిసిందే.

పక్కపక్కనే కూర్చున్న కేసీఆర్.. జగన్ లు ఇద్దరు మాట్లాడుకోవటం తెలిసిందే.

ఈ పెళ్లి వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన పది నిమిషాలకు జగన్ రావటం.. ఇరువురు దాదాపు అరగంట పైనే పెళ్లి వేడుకలో గడిపారు. అంతేకాదు.. ఇరువురు కలిసి పెళ్లి వేడుకను తిలకించి.. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు వేదిక మీదకు వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం స్టేజ్ కిందకు వచ్చారు. ఈ సందర్భంలోనే ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

కొత్త జంటను ఆశీర్వదించిన తర్వాత కిందకు వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు.. టీ తాగేందుకు ఒక గదిలోకి వెళ్లారు. దాదాపు ఐదు నిమిషాల పాటు ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాంతంగా మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ఏర్పడిన తర్వాత తొలిసారి కలిసింది ఇప్పుడే. ఏకాంతంగా మాట్లాడుకున్న తర్వాత ఎవరి దారిన వారు వెళ్లారు. మొత్తంగా పెళ్లికి వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాంతంగా మాట్లాడుకున్న ఆ ఐదు నిమిషాల మీదన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.



Tags:    

Similar News