ఈ బాదుడేంది అప్పలరాజా!?

Update: 2022-05-19 09:31 GMT
గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.. సీదిరి అప్పలరాజు. ఎంసెట్‌లో టాప్‌ టెన్‌లో నిలిచి ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. అది కూడా గోల్డ్‌ మెడల్‌తో. మంచి హస్తవాసి గల వైద్యుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. స్వతహాగా యువకుడు, చొరవ, మంచి ఉత్సాహం ఉండటంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అప్పలరాజును తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన అప్పలరాజుకు జగన్‌ మత్స్య, పశుసంవర్థక శాఖలను కేటాయించారు.

అయితే.. మంత్రి అయినప్పటి నుంచి అప్పలరాజు వ్యవహార శైలి మారిపోయిందని తోటి ప్రజాప్రతినిధులు, అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇటీవల విశాఖలో ఒక సీఐని చొక్కా ఊడదీసి కొడతానంటూ సీదిరి అప్పలరాజు చిందులు తొక్కారు. అంతేకాకుండా తన శాఖ అధికారులు సమావేశాల్లో ఏదన్నా చెప్పబోయినా.. వారిని వారించి నాకంతా తెలుసన్నట్టు మాట్లాడుతున్నారంట. నేనొక డాక్టర్‌ని.. అందులోనూ గోల్డ్‌ మెడలిస్టుని.. మీరు నాకు చెప్పేది ఏంటన్నట్టు మంత్రి వ్యవహార శైలి ఉందని అధికారులు వాపోతున్నారని సమాచారం.

ప్రస్తుతం సీదిరి అప్పలరాజు కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఉన్నారు. కాకినాడలో వివిధ సమీక్షలకు, సమావేశాలకు వెళ్తున్న ఆయన అక్కడ మిగతా ప్రజాప్రతినిధులను కూడా లెక్క చేయడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి.. సీదిరి అప్పలరాజు రాజకీయాల్లో చాలా జూనియర్‌. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఆయన మిగతా ప్రజాప్రతినిధులతో వ్యవహరిస్తున్న తీరు మాత్రం తాను చాలా పెద్ద సీనియర్‌ రాజకీయ నేతనన్నట్టు ఉంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అధికారులతోనూ అలాగే వ్యవహరిస్తున్నారని అంటున్నారు. నేను జిల్లా ఇన్‌చార్జి మంత్రిని.. ఇక్కడ అంతా నేనే.. నేను చెప్పినట్టు మీరు వినాలి.. నేను డాక్టర్‌ని.. గోల్డ్‌ మెడలిస్టునని సీదిరి అప్పలరాజు చెప్పిందే చెప్పి తలలు తింటున్నారంట. ఇలా పదేపదే ఆయన స్కోత్కర్షలు వినలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది.

కాకినాడ గురించి కూడా తనకు తెలుసని.. తాను ఇక్కడే చదువుకున్నానని.. కాబట్టి తాను చెప్పే విషయాలను మీరు వినాల్సిందేనంటూ అప్పలరాజు అధికారులకు తనదైన శైలిలో క్లాసులు పీకుతున్నారంట. దీంతో అధికారులు లబోదిబోమంటున్నారంట. గతంలో ఎంతోమందిని ఇన్‌చార్జులుగా చూశామని.. కానీ ఎవరూ అప్పలరాజులా ప్రవర్తించలేదని ఒకరితో ఒకరు చెప్పుకుని బావురుమంటున్నారంట. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందడానికి కారణం తానేనని.. దానికి మాదిరిగా కాకినాడను కూడా అభివృద్ధి చేస్తానని అప్పలరాజు చెబుతున్న మాటలకు లోలోన అధికారులు నవ్వుకుంటున్నారంట.
Tags:    

Similar News