అమ్మను అపోలోకు కొనఊపిరితో తెచ్చారట

Update: 2017-02-27 04:46 GMT
ఒకే విషయాన్ని అదే పనిగా ప్రస్తావించటం ద్వారా.. అనుమానాల్ని మరింత బలపరిచే అవకాశం ఉంటుంది. అమ్మ మృతి మీద కూడా ఇప్పుడదే ప్రయత్నం జరుగుతుందా? అన్న సందేహాలు కలిగేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమ్మది అనుమానాస్పద మృతి అని.. ఆమెపై పోయెస్ గార్డెన్ లోనే దాడి జరిగిందంటూ ఇప్పటికే ఆరోపణలు రావటం తెలిసిందే. వీటికి అదనంగా తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు అన్నాడీఎంకే సీనియర్ నేత.. పన్నీర్ వర్గానికి చెందిన మాజీ మంత్రి సి.పొన్నయన సంచలన ఆరోపణలు చేశారు.

అమ్మ మృతిలో ఎన్నో సందేహాలు ఉన్నాయని.. ఆసుపత్రిలో చేర్చటానికి ముందే పోయెస్ గార్డెన్ లో ఆమెపై దాడి జరిగిందన్నారు. కొన ఊపిరితోనే అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారని.. ఆమెను తీసుకురావటానికి ముందు.. అపోలో ఆసుపత్రి యాజమాన్యంతో రహస్య ఒప్పందం చేసుకున్నట్లుగా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన పొన్నయన.. అమ్మకు చికిత్స జరుపుతున్న వార్డులోకి ఎవరిని అనుమతించకపోవటంలో రహస్యం ఉందన్న వాదనను వినిపించారు.

అమ్మకు చికిత్స జరుపుతున్న వార్డులోకి ఎవరినీ అనుమతించలేదని.. అదేమంటే ఆమెకు అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉందని చెప్పారని.. మరి.. 73 రోజులపాటు జయ దగ్గరే గడిపారని చెబుతున్న శశికళకు అంటువ్యాధులు ఎందుకు సోకలేదో అర్థం కావటం లేదని ప్రశ్నించారు. అమ్మ మృతి మీద న్యాయవిచారణ జరపాలన్న డిమాండ్ ను మరోసారి వినిపించారు. పోయెస్ గార్డెన్ లో అమ్మ మీద దాడి జరిగిందని.. తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో ఆమెను ఆసుపత్రికి తరలించినట్లుగా ఇప్పటికే పన్నీర్ వర్గం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి మరింత బలాన్ని కలిగించేలా.. శశికళ వర్గాన్ని ఆత్మరక్షణలో పడేసేలా ఆరోపణలు చేయటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News