రజనీ కాంత్ ను మద్దతు కోరుతా : కమల్ హాసన్

Update: 2021-01-07 10:30 GMT
'నేను రాజకీయాల్లోకి రావట్లేదు' అంటూ రజనీకాంత్ చేసిన ప్రకటన అటు అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేయగా.. రాజకీయ పార్టీలకు సరికొత్త వ్యూహాలను రచించాల్సిన పరిస్థితిని కల్పించింది. తాజా పరిణామంతో తమ ప్లాన్స్ మొత్తం తుడిచేసి, కొత్త ప్లాన్లు రూపొందించుకుంటున్నాయి అక్కడి పార్టీలు. ఈ క్రమంలో అందరి ముందున్న ఏకైక లక్ష్యం.. రజనీని మచ్చిక చేసుకోవడం.
 
రాజకీయాల్లోకి ఎలాగూ రానని చెప్పాడు కాబట్టి.. ఆయన పాపులారిటీని వాడుకునేందుకు అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. రజనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది మంది అభిమానులు ఆయనను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆ కోట్ల మందిని తమ పార్టీకి పడే ఓట్లుగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆయా పార్టీల నేతలు. ఇందులో భాగంగా.. త్వరలో బీజేపీ నేత అమిత్ షా రజనీతో భేటీ కానున్నట్టు వార్తలు వస్తున్నాయి.

తాజాగా.. రజనీ సహచరుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ రజనీ మద్దతు కోరబోతున్నాడు. తన పార్టీకి మద్దతివ్వాలని సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కోరుతానని కమల్ వెల్లడించారు. రజనీ తనకు మంచి స్నేహితుడు అన్న కమల్.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానన్న ఆయన నిర్ణయం అభిమానుల్లాగే తననూ తీవ్ర నిరాశకు గురి చేసిందని వ్యాఖ్యానించారు. అయితే.. రజనీ ఆరోగ్యమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.

తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికలు నిజాయితీకి, అవినీతికి మధ్య జరిగే ఎన్నికలు అన్న కమల్.. తన ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రజనీకాంత్‌ను కలుస్తానని చెప్పారు. కాగా.. రజనీ ఎవరికి ఓటు వేయమని చెబితే.. వారికే ఓటు వేసే అభిమానులు కూడా ఎంతో మంది ఉన్నారు. వారందరినీ తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి.

Tags:    

Similar News