ఎక్క‌డ‌.. ఇంత జ‌రిగినా.. బాబు ద‌త్త‌పుత్రుల మౌనం..!

Update: 2021-09-18 05:30 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ద‌త్త‌పుత్రులుగా పిలుచుకునే చాలా మంది నాయ‌కులు.. తాజాగా జ‌రిగిన చంద్ర‌బాబు ఇంటిపై దాడి ఘ‌ట‌న విష‌యంలో మౌనం వ‌హించ‌డం.. రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ మాజీ నాయ‌కుడు, ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్‌, టీజీ వెంక‌టేష్ వంటివారు.. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు మ‌నుషులుగా చ‌లామ‌ణి అవుతున్నా ర‌నేది రాజ‌కీయ నేతలు చెబుతున్న విష‌యం. రాష్ట్రంలో ఏం జ‌రిగినా.. సీఎం జ‌గ‌న్ ఏం చేసినా.. వెంట‌నే స్పందించిన వీరు.. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో ఏవిధంగా వ్య‌వ‌హరించారో అంద‌రికీ తెలిసిందే.

మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబును కానీ, ఆయ‌న కుమారుడు లోకేష్ కానీ.. ఎవ‌రు ఒక్క మాట అన్నా కూడా వీరు ఊరుకునేవారు కాదు. వైసీపీ నాయ‌కులు చేసే విమ‌ర్శ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రోక్షంగా అయినా కౌంట‌ర్లు ఇచ్చిన ప‌రిస్థితి క‌నిపించింది. కానీ, తాజాగా జ‌రిగిన చంద్ర‌బాబు ఇంటిపై దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి ఒక్క‌రంటే..ఒక్క‌రూ నోరు పెగ‌ల్చ‌లేదు. ఎవ‌రూ స్పందించ‌లేదు. దీనికి కార‌ణ‌మేంటి?  చంద్ర‌బాబుకు దూర‌మ‌య్యారా?  లేక‌.. బీజేపీ విధానాల‌కు క‌ట్టుబ‌డ్డారా?  ఇదీ ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారిన చ‌ర్చ‌నీయాంశం. వాస్త‌వానికి పార్టీల‌కు అతీతంగా అంద‌రూ స్పందిస్తున్న విష‌యం తెలిసిందే.

కానీ, ఒక‌ప్పుడు చంద్ర‌బాబుకు రైట్ హ్యాండ్‌గా వ్య‌వ‌హ‌రించిన సుజ‌నా చౌద‌రి ఈ విష‌యంలో మౌనంగా ఉండ‌డంపై టీడీపీ నేత‌లు కూడా విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌ల సమ‌యంలో జ‌రిగిన ర‌చ్చ‌పై బాహాటంగానే వైసీపీని త‌ప్పుబ‌ట్టారు సుజ‌నా. దీంతో అప్ప‌ట్లోనే ఆయ‌న బీజేపీ ఉన్న‌ప్ప‌టికీ.. టీడీపీ మ‌నిషే... అని ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై బీజేపీ పెద్ద‌ల‌కు రాష్ట్ర నాయ‌కులు ఫిర్యాదు చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఇప్పుడు మౌనం వ‌హించార‌ని కొంద‌రు చెబుతున్నారు. ఇక‌, క‌డ‌ప జిల్లాకు చెందిన సీఎం ర‌మేష్  కూడా చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడిగా ఉన్నారు.

కానీ, బీజేపీలోకి వెళ్లారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న కూడా త‌ర‌చుగా టీడీపీ విష‌యంలో అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా స్పందిస్తున్నారు. కానీ, ఈ విష‌యంలో మాత్రం మౌనంగా ఉన్నారు. మ‌రో మాజీ మంత్రి, క‌డ‌ప‌కే చెందిన నాయ‌కుడు ఆదినారాయ‌ణ‌రెడ్డి కూడా మౌనంగా ఉన్నారు. మ‌రి దీనికి రీజ‌నేంటి? అనేది ఇప్ప‌టికిప్పుడు తెలియ‌క‌పోయినా.. టీడీపీ పుంజుకునే ప‌రిస్థితి లేద‌ని.. అన‌వ‌స‌రంగా జోక్యం చేసుకుని త‌మ‌కు ఇబ్బందులు తెచ్చుకోవ‌డం ఎందుక‌ని వీరు భావిస్తున్నార‌నే ప్ర‌చారం మాత్రం జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News