'ఫిపా'లో సంచలనం.. మెస్సీ సేనను చిత్తు చేసిన'సౌదీ'.!

Update: 2022-11-23 03:48 GMT
సాకర్ సమరం మొదలైపోయింది. నవంబర్ 20 నుంచి ఖతార్ వేదిక గా ప్రపంచ కప్ ఫుట్ బాల్-2022 వేడుకలు అట్టహాసంగా ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే ఫుట్ బాల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. గ్రూప్ సి లో భాగంగా దోహా స్టేడియంలో తాజాగా సౌదీ అరేబియా.. అర్జెంటీనా జట్ల మధ్య పోటీ  జరిగింది. ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరేట్ గా అగ్రశ్రేణి జట్టు అర్జెంటీనా బరిలో నిలిచింది.

అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సౌదీ అరేబియా అర్జెంటీనాపై సంచలన విజయం నమోదు చేయడం సంచలనంగా మారింది. దిగ్గజ ఆటగాడు మెస్సీ ఉన్న అర్జెంటీనా జట్టు పని కూన సౌదీ అరేబియా చేతిలో పరాజయం పాలు కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విజయంతో సౌదీ అరేబియా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అర్జెంటీనా సౌదీ అరేబియా మ్యాచ్ ను పరిశీలిస్తే.. హాట్ ఫేవరేట్ గా బరిలో దిగిన అర్జెంటీనా తొలి నుంచి ఆధిక్యం ప్రదర్శించింది. మ్యాచ్ ప్రారంభంలో అర్జెంటీనా జట్టుకు పెనాల్టీ గోల్ చేసే అవకాశం లభించింది. స్టార్ ప్లేయర్ మెస్సీ గోల్ చేయడంతో తొలి సగ భాగం ముగిసే సమయానికి అర్జెంటీనా 1-0తో లీడ్ లో ముందంజలో నిలిచింది.

అయితే సెకండాఫ్ లో మాత్రం సౌదీ అరేబియా దూకుడును ప్రదర్శించింది. ఇరు జట్లు బంతిపై ఆధిపత్యం సాధించేందుకు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ 47వ నిమిషంలో సౌదీ ఆటగాడు అల్ పెహ్రీ గోల్ చేశాడు. దీంతో ఇరు జట్లు 1-1 పాయింట్లతో సమంగా నిలిచాయి. దీంతో మరింత ఉత్సాహంతో సౌదీ ఆటగాళ్ళు ప్రత్యర్థి పోస్టుపై దూకుడు పెంచారు.

మ్యాచ్ 57వ నిమిషంలో సౌదీ ఆటగాడు సలీమ్ అల్ దవాసరి గోల్ చేయడంతో ఆ జట్టు 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈక్రమంలోనే అర్జెంటీనా ఆటగాళ్లు పదే పదే గోల్ చేసేందుకు ప్రయత్నించినా సౌదీ డిఫెన్స్ ఆటగాళ్లు బలంగా తిప్పికొట్టారు. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు సౌదీ ఆటగాళ్లు ఏ మాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో సౌదీ అరేబియా విజయం ఖరారైంది.

ఈ మ్యాచ్ కు ముందు వరకు కూడా సౌదీ అరేబియాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. 2019 నుంచి అర్జెంటీనా జట్టు వరుసగా 36 మ్యాచుల్లో విజయం సాధించింది. దీంతో అర్జెంటీనా టీం దోహలో హాట్ ఫేవరేట్ గా నిలిచింది.

అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 51వ ర్యాంక్ లో ఉన్న సౌదీ అరేబియా డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను తొలిసారి ఓడించి సంచలనం సృష్టించింది. అర్జెంటీనా తన తదుపరి మ్యాచ్ మెక్సికోతో ఆదివారం తలపడనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News