ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ ఆదానీ సంచలన వ్యాఖ్యలు!

Update: 2022-12-29 09:30 GMT
పారిశ్రామిక దిగ్గజం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత, ప్రపంచంలో అపర కుబేరుల్లో ఒకరైన గౌతమ్‌ ఆదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రధాని మోదీతో సంబంధాల కారణంగానే అదానీ గ్రూప్‌ పరిశ్రమలు లాభపడుతున్నట్లు వస్తోన్న వార్తలను ఆయన ఖండించారు. ప్రధాని మోదీ, తాను ఒకే  రాష్ట్రం గుజరాత్‌ కు చెందిన వాళ్లమని.. అందుకే తమపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని గౌతమ్‌ ఆదానీ మండిపడ్డారు. తమ సంస్థ సాధిస్తున్న విజయాలను చూసి ఓర్వలేక కొందరు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.

మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు, సంస్థాగత సంస్కరణల కారణంగానే తమ సంస్థ ఈ స్థాయిలో విజయం సాధించగలిగిందని గౌతమ్‌ ఆదానీ తెలిపారు. అంతేగానీ, ఏ ఒక్క రాజకీయ నేత కారణంగానో కాదని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఏ ఒక్క రాజకీయ నేత వల్లనో తాను విజయం సాధించలేదని చెప్పారు.

విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఈ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే.. దాన్ని నాలుగు దశలుగా విభజించొచ్చని గౌతమ్‌ ఆదానీ తెలిపారు. రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే తన కెరీర్‌ తొలి దశ మొదలైందని తెలిపారు. ఆయనే తొలిసారి ఎగుమతులు, దిగుమతుల పాలసీని సరళీకరించారని గుర్తు చేసుకున్నారు. అప్పుడే రాజీవ్‌ గాంధీ తొలిసారిగా ఓపెన్‌ జనరల్‌ లైసెన్స్‌ జాబితాలో అనేక ఉత్పత్తులను తీసుకొచ్చారని తెలిపారు. అదే తమ సంస్థ ఎగుమతులు పెరగడానికి దోహదపడిందన్నారు. రాజీవ్‌ గాంధీ లేకపోతే.. వ్యాపారవేత్తగా తన కెరీర్‌ సాగకపోయేదేమోనన్నారు.

ఇక తన కెరీర్‌ లో రెండో దశ 1991లో మొదలైందని గౌతమ్‌ ఆదానీ తెలిపారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్‌ కలిసి విస్తృతమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. మిగతా పారిశ్రామికవేత్తల్లానే తాను వాటి నుంచి లబ్ధిపొందానని వివరించారు.

తన కెరీర్‌ లో మూడో దశ 1995లో కేశుభాయ్‌ పటేల్‌ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభమైందని గౌతమ్‌ ఆదానీ తెలిపారు. సీఎంగా ఆయన తీరప్రాంత అభివృద్ధి పై దృష్టి పెట్టి అనేక విధానాలను తీసుకొచ్చారని వెల్లడించారు. దానివల్లే తాము గుజరాత్‌ లోని ముంద్రాలో తొలి పోర్ట్‌ను నిర్మించగలిగామని చెప్పారు.

ఇక తన కెరీర్‌ లో నాలుగో దశ 2011లో నరేంద్రమోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు మొదలైందన్నారు. ఆయన విధానాలు, వాటి అమలు గుజరాత్‌ ఆర్థిక స్వరూపాన్నే మార్చేశాయన్నారు. ఇప్పుడు ప్రధానిగా మోదీ సమర్థ నేతృత్వంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో సరికొత్త భారత్‌ను  చూస్తున్నామని గౌతమ్‌ ఆదానీ కొనియాడారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News