ప్రచారానికి కూడా సెంటిమెంట్ వ‌ద‌ల‌వా కేసీఆర్‌?

Update: 2018-11-05 10:59 GMT
`ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో 100కు పైగా బ‌హిరంగ స‌భ‌ల‌తో రాష్ర్టాన్ని చుట్టేస్తాన‌ని ప్ర‌క‌టించిన టీఆర్ ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్ ఎక్క‌డ‌? త‌న ఫాంహౌస్‌ లో ప‌డుకున్నారా? ప‌్ర‌జావ్య‌తిరేక‌త‌ను ప‌సిగ‌ట్టే జ‌నంలోకి రావడం లేదా?` ఇది ప్ర‌తిప‌క్షాల ప్రశ్న‌. `సారు ఎప్పుడు మ‌లివిడ‌త ప్ర‌చారం మొద‌లుపెడ‌తారో?!` ఇది పార్టీ నేత‌ల ఆందోళ‌న కం ఆలోచ‌న‌. ఇలా స్వ‌ప‌క్షాన్ని - విప‌క్షాన్ని త‌న ప్ర‌చారం కోసం ఎదురుచూసేలా చేస్తున్న గులాబీ ద‌ళ‌ప‌తి తాజాగా ఇందుకు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే, ప్ర‌చారానికి సైతం ఆయ‌న త‌న సెంటిమెంట్‌ ను ఎంచుకున్నారు. న‌వంబ‌ర్ ఆరు నుంచి ఆయ‌న మ‌లివిడ‌త ప్ర‌చారం చేయ‌నున్నారు.

టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ కు సెంటిమెంట్లపై న‌మ్మ‌కం ఎక్కువ‌నే సంగ‌తి తెలిసిందే. `6`ను కేసీఆర్‌ తన లక్కీ నెంబర్‌ గా భావిస్తారు. కేసీఆర్‌ కాన్వాయ్‌ లోని కార్ల నంబర్లన్నీ 6666గానే ఉంటాయి.. సెప్టెంబరు ఆరున్నే ఆయన శాసనసభను రద్దు చేశారు. అదే రోజు 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇలా 6 నంబరుపై ఆయనకున్న నమ్మకం అంతా ఇంతా కాదు. త‌న సెంటిమెంట్‌ కు పెద్ద పీట వేస్తూ ఈనెల ఆరో తేదీన్నే ఆయన తన రెండో విడత ప్రచారానికి స్వీకారం చుట్టబోతున్నారని సమాచారం. ఎన్నికల ప్రణాళిక రూపకల్పన పూర్తయితే అదేరోజు పూర్తి స్థాయి మ్యానిఫెస్టోను సైతం విడుదల చేసేందుకు గులాబీ బాస్‌ యోచిస్తున్నారనేది టీఆర్ ఎస్‌ వర్గాల నుంచి అందిన సమాచారం. 105 మంది పోను మిగతా అభ్యర్థులను కూడా అదే రోజు ప్రకటించే అవకాశముందని ఆయా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈనెల మొదటి వారంలోనే ఉమ్మడి ఖమ్మం - వరంగల్‌ - కరీంనగర్‌ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ఆయన నిర్ణయించినట్టు సమాచారం. అదృష్ట సంఖ్యపై ఉన్న నమ్మకంతో ఈనెల ఆరు నుంచి ఆయా సభలకు శ్రీకారం చుట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈనెల ఆరు నుంచి లెక్కిస్తే పోలింగ్‌ నాటికి సరిగ్గా నెల రోజుల వ్యవధే ఉంటుంది. ఈ వ్యవధిలోనే నియోజకవర్గాల వారీగా 100 బహిరంగ సభలు ఎలా నిర్వహించాలన్న దానిపై కూడా కేసీఆర్‌ ఒక ప్రణాళిక రచించినట్టు తెలిసింది. అందులో భాగంగా రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసినట్టు సమాచారం.

కంటి - పంటి పరీక్షల నిమిత్తం ఢిల్లీ వెళ్లి వచ్చిన కేసీఆర్‌.. ఆ తర్వాత ప్రగతి భవన్‌ నుంచి ఫామ్‌ హౌజ్‌ కు వెళ్లారు. అక్కడినుంచే పార్టీ అభ్యర్థుల ప్రచారం - వివిధ నియోజకవర్గాల్లోని పరిస్థితులు - ప్రతిపక్షాల వ్యూహాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. వాటిపై తాజా రిపోర్టులు తెప్పించుకుని క్షుణ్నంగా పరిశీలించారు. ఇతర పార్టీల వ్యూహాలకు అనుగుణంగా ఆయన ఫామ్‌ హౌజ్‌ లోనే ప్రతివ్యూహాలను రచించినట్టు తెలిసింది. 2014 ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్‌ ను వినియోగించిన కేసీఆర్‌... ఈసారి హెలికాప్టర్‌ పర్యటనలతోపాటు రోడ్‌ షోలు కూడా నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక బస్సును రూపొందించారు. ఆ బస్సుతో రోడ్‌ షో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా ప్రత్యేకంగా ఓ ట్రయల్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రగతి భవన్‌ నుంచి ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి అదే బస్సులో ఆయన ఓ రోజు ప్రయాణించారని తెలిసింది. ఆరో తేదీన ఈ మేర‌కు  కేసీఆర్ త‌న మార్కు క్లారిటీ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.

Tags:    

Similar News