కరోనా వేళ.. ఎవరికి తోచింది వారు చెప్పేస్తున్నారట

Update: 2020-03-25 23:30 GMT
భయానికి మించింది మనిషి బతుకులో మరొకటి ఉండదు. అందునా దేశాలకు దేశాల్ని నాశనం చేస్తూ.. కోలుకోలేనంతగా దెబ్బ తీసే కరోనా లాంటి మహమ్మారిని డీల్ చేయటం అంత తేలికైన విషయం కాదు. కరోనా వైరస్ తీవ్రత ఎంతన్న విషయం దేశ ప్రజల్లో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. చదువుకున్న వారు.. సామాజిక అవగాహన ఉన్న వారిలో సైతం కరోనా గురించి తెలిసినా.. దాన్ని సీరియస్ గా తీసుకోకపోవటం ప్రపంచంలోని చాలా దేశాల్లో చూసిందే. అలాంటి తప్పులు చేసిన.. ఇటలీ.. అమెరికా లాంటి దేశాలు ఎంత భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందన్నది కళ్లారా చూస్తున్నారు.

దీంతో.. అప్పటివరకూ కరోనా పట్టని చాలామంది.. ఇప్పుడు భయంతో వణుకుతున్నారు. బతుకు భయం పెరిగిపోతున్న వేళ.. కొత్త నమ్మకాలు పుట్టుకురావటమే కాదు.. ఎవరికి వారు వైద్యులుగా.. శాస్త్రవేత్తలుగా మారిపోయే తీరు ఇప్పుడు కనిపిస్తోంది. కొందరు స్వాములు పూజలు.. హోమాలు చేస్తూ.. కరోనాను కట్టడి చేయొచ్చన్న మాట చెబుతున్నారు. ఇలాంటి భయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. కొత్త కొత్త నమ్మకాలు పుట్టుకు రావటం మామూలే. కరోనా వేళలోనూ.. అలాంటివెన్నో ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి.

ఇంట్లో మగపిల్లలు ఉన్న వారు వారి కోసం ప్రత్యేక పూజలు చేయటం కొందరు షురూ చేస్తే.. ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి సంబంధించి ఒక్కో చెంబు చొప్పున నీళ్లను వేపచెట్టుకు పోయాలన్న నమ్మకం అంతకంతకూ విస్తరిస్తోంది. వేపచెట్టుకు నీళ్లు పోస్తే.. కరోనా రాదన్నది నోటి మాట స్థాయి నుంచి వాట్సాప్ మెసేజ్ ల వరకూ వెళ్లిపోయింది. దీంతో.. వేపచెట్టుకు డిమాండ్ పెరిగిపోయింది.

ఇంతకాలం ఉగాది రోజు తప్పించి విడిగా పట్టని వేపచెట్టు ఇప్పుడు అదో దేవాలయంగా మారింది. వేపచెట్టు వద్ద పసుపు.. కుంకుమ.. కొబ్బరికాయలుపట్టుకొని క్యూ కట్టేస్తున్నారు. ఇలాంటివెన్నో సలహాలు.. సూచనల్ని తెర మీదకు తీసుకొచ్చి.. కరోనావైరస్ రాకుండా ఉండాలంటే ఇలా చేస్తే సరిపోతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News