శ్వేత జాతిలో విరిసిన నల్లకలువ.. సెరీనా టెన్నిస్ ప్రస్థానం

Update: 2022-09-04 00:30 GMT
14 ఏళ్లకే అమెరికా ఓపెన్ లో దిగి ప్రపంచ టెన్నిస్ రారాణిగా అవతరించింది సెరీనా.. తన అక్క వీనస్ ను స్ఫూర్తిగా తీసుకొని టెన్నిస్ లోకి వచ్చిన సెరీనా ఇప్పుడు 40 ఏళ్లకు టెన్నిస్ కు వీడ్కోలు పలికింది. 27 ఏళ్ల పాటు టెన్నిస్ ను శ్వాసగా బతికిన సెరీనా ఇప్పుడు కెరీర్ నుంచి వైదొలిగింది. తను ప్రొఫెషనల్ మ్యాచ్ ఆరంభించిన అదే టెన్నిస్ కోర్టులో తుది మ్యాచ్ ఆడింది. గత మ్యాచ్ సమయంలో సెరీనాను ఇంటర్వ్యూ చేయగా కన్నీళ్లు వచ్చాయి.

1981 సెప్టెంబరు 26న అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో సాంగినావ్ నగరంలో సెరీనా జన్మించారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని కాంప్టన్ నగరంలో పెరిగారు. ఆమె తల్లి ఒరాసీన్ ప్రైస్ నర్సుగా పనిచేసేవారు. తండ్రి రిచర్డ్ విలయమ్స్ ఒక సెక్యూరిటీ సర్వీసు నడిపేవారు. సెరీనాకు అక్క వీనస్ విలయమ్స్ ఉన్నారు. సెరీనా విలయమ్స్ లేని టెన్నిస్ ను ఊహించడం చాలా కష్టం. ఈనెలలోనే 41వ పుట్టినరోజు జరుపుకుంటున్న సెరీనా 27 ఏళ్ల సుధీర్ఘ టెన్నిస్ కెరీర్ లో 23 సార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ చాంపియన్ గా గెలిచారు.

వీనస్, సెరీనాలు టెన్నిస్ అకాడమీలో చేరడానికి వీలుగా వీరి కుటుంబం 1991లో ఫ్లోరిడాకు నివాసం మారింది. 1994లో వీనస్ ప్రొఫెషనల్ టెన్నిస్ లోకి  అడుగుపెట్టింది. ఆ తర్వాత ఏడాది సెరీనా కూడా టెన్నిస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

వీనస్, సెరీనా పవర్ ఫుల్ సర్వీసులు, గ్రౌండ్ స్ట్రోక్ లు, అథ్లెటిక్ సామర్థ్యంతో తక్కువ కాలంలోనే గ్రాండ్ స్లామ్ లు గెలిచి పాపులర్ అయ్యారు. చెల్లి సెరీనా 199లో యూఎస్ ఓపెన్ చాంపియన్ గా తొలి టైటిల్ గెలిచింది. 17 ఏళ్లకే ఈ ఘనత సాధించింది. వరల్డ్ నంబర్ 1 మార్టినా హింగిస్ ను ఫైనల్ లో ఓడించి సెరీనా కప్పు కొట్టడం సంచలనమైంది.

ఇదే టోర్నమెంట్ లో అక్క వీనస్ తో కలిసి సెరీనా డబుల్స్ టైటిల్ ను గెలిచింది. సెరీనా తొలి గ్రాండ్ స్లామ్ గెలిచాక వీనస్ గెలిచింది.

ఇక 2002 సంవత్సరంలో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ మూడింటిలోనూ వీనస్, సెరీనా ఫైనల్స్ లో టైటిల్ కోసం తలపడడం.. టైటిల్ వీరి కుటుంబానికే దక్కడం విశేషంగా చెప్పొచ్చు. మూడు చోట్లా అక్క వీనస్ మీద చెల్లి సెరీనా గెలిచారు.

2017లో సెరీనా విలయమ్స్ రెడిట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్ ను పెళ్లి చేసుకున్నారు. సెరీనా ఎనిమిది వారాలా గర్భంతో ఉండి కూడా ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ గెలవడం విశేషం. అది ఆమెకు 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం.

2017లో సెరీనా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. సిజేరియన్ ఆపరేషన్ కావడం.. ఆరోగ్యం దెబ్బతినడంతో సెరీనా మంచానికే పరిమితమయ్యారు.

2018లో మళ్లీ ఆట మొదలుపెట్టినా కానీ సెరీనా వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఫైనల్స్ వరకూ చేరి టైటిల్ గెలవలేకపోయారు. 2021లో ఆస్ట్రేలియా ఓపెన్  ఫైనల్ లో నవోమి ఒసాకా చేతిలో ఓడాక రిటైర్ మెంట్ పై ఆలోచిస్తున్నట్టు తెలిపారు. అమెరికాలో వర్ణ వివక్ష గురించి.. తండ్రికి జరిగిన అవమానంపై.. అమెరికాలో జాతి వివక్ష ఎదుర్కొంటున్న వారిపై సెరీనా గళమెత్తారు. పురుషులతో సమానంగా స్త్రీలకు పారితోషికం ఉండాలని పట్టుబట్టి వార్తల్లో నిలిచారు.

తాజాగా రిటైర్ అవుతున్నట్టు ప్రకటించి టెన్నిస్ అభిమానులకు తుదివీడ్కోలు పలికారు. ఇన్నేళ్లలో ఎన్నో టైటిల్స్ గెలిచిన ఈ నల్లకలువకు టెన్నిస్ అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఆమె భావి జీవితం బాగుండాలని కోరుకుంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News